Tuesday, November 26, 2024

India | భారత్​ జోడోకు పెరుగుతున్న మద్దతు.. రాహుల్​తో కలిసి నడిచిన రిటైర్డ్​ ఆర్మీ ఆఫీసర్లు

భారత్​ జోడో యాత్ర జోష్​గా సాగుతోంది. ఉత్తరాదిన విపరీతమైన చలి, అతిశీతల గాలులు, దట్టమైన పొగమంచు కురుస్తున్నా పార్టీ ముఖ్య నేత రాహుల్​ గాంధీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల మైనస్​ డిగ్రీల్లో టెంపరేచర్లు నమోదవుతున్నా.. తాను సాధారణ టీషర్ట్​, ప్యాంట్​తోనే యాత్రలో పాల్గొంటున్నారు. అయితే.. ఇవ్వాల (ఆదివారం) హర్యానాలో జరిగిన పాదయాత్రలో ఆర్మీ రిటైర్డ్​ ఆఫీసర్లు పెద్ద ఎత్తున పాల్గొని రాహుల్​ యాత్రకు మద్దతు తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్రలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్, ఇతర రిటైర్డ్ టాప్ డిఫెన్స్ అధికారులు పాల్గొన్నారు. పాదయాత్ర కర్నాల్‌, నీలోఖేరి ప్రాంతంలోని దోడ్వా నుండి ఆదివారం ఉదయం ప్రారంభమైంది. తరువాత రోజు కురుక్షేత్ర జిల్లాలోకి ప్రవేశించనుంది. ఇంతటి చలిలో కూడా రాహుల్​తో పాటు యాత్రలో పాల్గొన్న చాలామంది కాంగ్రెస్ మద్దతుదారులు చొక్కా లేకుండా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. హర్యానా యాత్రలో పార్టీ సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, కుమారి సెల్జా తదితరులు పాల్గొన్నారు.

కాగా, మాజీ ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ దీపక్ కపూర్, లెఫ్టినెంట్ జనరల్ RK హుడా, లెఫ్టినెంట్ జనరల్ VK నరుల, AM (ఎయిర్ మార్షల్) PS భంగు, మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ చౌదరి, మేజర్ జనరల్ ధర్మేందర్ సింగ్, కల్ జితేందర్ గిల్, కల్ పుష్పేందర్ సింగ్ , లెఫ్టినెంట్ జనరల్ డిడిఎస్ సంధు, మేజర్ జనరల్ బిషంబర్ దయాల్, కల్నల్ రోహిత్ చౌదరి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఓ ట్వీట్‌లో పేర్కొంది.

సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్​  జోడో యాత్ర జనవరి 30 నాటికి శ్రీనగర్‌కు చేరుకుని అక్కడ రాహుల్​ గాంధీ జాతీయ జెండా ఎగురవేయడంతో ముగుస్తుంది. ఈ పాదయాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను కవర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement