అగ్నిపథ్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్యమంపై పోలీసుల కాల్పులను ఖండించారు మావోయిస్టు పార్టీ నేత జగన్. ఈమేరకు ఆయన ఇవ్వాల (సోమవారం) మీడియాకు లేఖ విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతోనే ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారని, వారి భవిష్యత్ ఆగమైతుందన్న ఆలోచనతోనే ఆగ్రహానికి గురయ్యారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం జరిగిందని, కావాలనే వాళ్లు అట్లా చేయలేదన్నారు మావోయిస్టు నేత జగన్. ఇక.. ఆందోళనాకారులపై కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా నేరం కింది కేసులు నమోదు చేయాలన్నారు. అగ్నిపథ్ పథకాన్ని బేషరతుగా రద్దు చేసి, యధావిధిగా ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలని సూచించారు.
పోలీసు కాల్పుల్లో చనిపోయిన రాకేష్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వాలని, గాయపడ్డ వారందరికీ ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంతేకాకుండా వెంటనే దేశంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.