గొప్పోళ్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పారిపోయారని, అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్టుగా నిలుస్తున్నాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని తుక్కుగూడలో జరిగిన విజయభేరీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజలంతా ఈ రెండు పార్టీల నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు.
పేదలకు అది చేస్తాం, ఇది చేస్తాం అని అలివికాని హామీలిచ్చారని, కానీ అవేమీ చేయకుండా ప్రధాని మోదీ అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి పేదల ఖాతాల్లో జమ చేస్తామని మోసపూరిత హామీలిచ్చారని ధనుమాడారు. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ అబద్ధాలు చెప్పారని, ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. తాముప్రకటించిన పథకాలను నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు.