Saturday, November 23, 2024

Followup: ‘అంతా నీవల్లనే, కాదు నీవల్లనే’.. జువైనల్​ హోమ్​లో తన్నుకున్న రేప్​ కేసు నిందితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ నిందితులు జువైనల్‌ హోంలో తన్నుకున్నారు. ఆదివారం రాత్రి భోజనాల సమయంలో ఐదుగురు నిందితులలో నలుగురు ఒక్కటై కార్పొరేటర్‌ కుమారుడైన మైనర్‌ నిందితుడిపై దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన హోం నిర్వాహకులు వారిని శాంతింపజేసినట్టు తెలిసింది. జరిగిన ఘటనకు కారణం నువ్వే అంటూ నలుగురు మైనర్లు కార్పొరేటర్‌ కుమారుడిపై దాడికి తెగబడ్డారని అంటున్నారు. నిందితులు పరస్పరం దాడికి పాల్పడటంతో అప్రమత్తమైన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బందోబస్తును పెంచారు.

సాదుద్దీన్‌కు 14 రోజుల రిమాండ్‌
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్‌ కస్టడీ ఆదివారంతో ముగిసింది. కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం నిందితుడిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

పథకం ప్రకారమే లైంగిక దాడి..
మైనర్‌ బాలికపై నిందితులు పథకం ప్రకారమే లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అమ్నీషియా పబ్‌కు బాలికలు వస్తారని, వారిలో ఎవరినో ఒకరిని లోబరచుకుని లైంగిక వాంఛ తీర్చుకోవాలని, లేకపోతే బెదరించైనా సరే లొంగ దీసుకోవాలని సాదుద్దీన్‌ మాలిక్‌ బృందం వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఫిర్యాదు వచ్చిన తర్వాత బెంజ్‌కారుతో పాటు ఇన్నోవా వాహనాన్ని సోదాలు జరిపిన పోలీసులకు కండోమ్‌ ప్యాకెట్లు లభించాయని విశ్వసనీయంగా తెలిసింది.

కండోమ్‌ ప్యాకెట్లను ఎక్కడ కొనుగోలు చేశారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కండోమ్‌ ప్యాకెట్లతో ముందుగానే పబ్‌కు వచ్చారంటే కావాలనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనవి భావించాల్సి వస్తోందని పోలీసులు అంటున్నారు. వచ్చిన బాలికపై నిందితులు పథకం ప్రకారమే లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పబ్‌లో జరిగే పార్టీకి వచ్చే అమ్మాయిలను ట్రాప్‌ చేయాలన్న ఆలోచన ఎవరిది, బాలికపై లైంగిక దాడికి పాల్పడాలన్న ప్రతిపాదన ఎవరిదన్న విషయాన్ని కూడా తెలుకునేందుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు.

వాంగ్మూలాలలో తేడాలున్నాయి
అత్యాచార నిందితులు ఆరుగురిని పోలీసులు విచారించినపుడు ఒకరి స్టేట్‌మెంట్‌కు మరొకరి స్టేట్‌మెంట్‌కు వ్యత్యాసాలున్నాయని పోలీసులు అంటున్నారు. అందరూ కూడబలుక్కుని ముందస్తు ప్రణాళిక మేరకే బాలికపై అత్యాచారానికి పాల్పడినప్పటికీ పోలీసుల విచారణలో పరస్పర విరుద్ధ వాంగ్మూలాలను ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నిందితుల వాంగ్మూలాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం అవసరమైతే మరోసారి లోతుగా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. అలాగే నిందితుల ఫోన్‌ కాల్‌ డేటాను కూడా సేకరించిన పోలీసులు అందులోని వివరాలను కూడా తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement