Saturday, November 23, 2024

Breaking: టీఆర్ఎస్‌ ప్లీనరీకి అంతా రెడీ.. 3 వేల మంది ప్రతినిధులకు ఆహ్వానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సమితి 21వ వార్షికోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం జరిగే ప్లీనరీ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర స్థాయిలో పార్టీ బలాబలాలపై విస్తృత స్థాయి సర్వేలు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ రంగప్రవేశం, సర్వే ఫలితాలు, కేంద్రంతో ఢీ అంటే ఢీ, అధికార, విపక్ష పార్టీల నడుమ వాడివేడి విమర్శలు, ప్రతి విమర్శలకు తోడు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు గులాబీ దళపతి కేసీఆర్‌ సన్నాహాల నేపథ్యంలో ఈ ప్లీనరీ జరుగుతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు తెరాస అధినేత కేసీఆర్‌ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభిస్తారు. కేసీఆర్‌ అధ్యక్షతన ఇక్కడి హెచ్‌ఐసీసీలో జరగనున్న రాష్ట్ర ప్రతినిధుల మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మంది నేతలను ఆహ్వానించారు.

గత అక్టోబర్‌ నెలలోనే తెరాస ద్విదశాబ్ది వార్షికోత్సవ ప్లీనరీ జరగ్గా ఆరు నెలల వ్యవధిలో 21వ వార్షికోత్సవం తెరాస నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెరాస మూడోసారి విజకేతనం ఎగురవేసి హ్యాట్రిక్‌ సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి వారిలో నూతనోత్తేజం నింపేలా పార్టీ అధినాయకత్వం అత్యంత ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మంగళవారం మధ్యాహ్నం ప్లీనరీ ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్లీనరీకి రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం 3,500 మందికి పార్టీ ఆహ్వానం పంపింది. వీరందరికీ బార్‌కోడ్‌తో ఉన్న పాసులను జారీ చేసింది. పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ అధిష్టానం నిర్దేశించింది. ఉదయం 10-11 గంటల మధ్య ప్రతినిధుల పేర్ల నమోదు, ఆ తర్వాత స్వాగతోపన్యాసం, పార్టీ అధినేత కేసీఆర్‌ తొలి పలుకు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement