Friday, November 22, 2024

Big Story: అంతా‘హ‌స్త‌’వ్య‌స్తం.. బలగమున్నా, బాధ్యులేరి? గ్రేటర్‌లో నాయకత్వ సమస్య

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగానే మారింది. పార్టీకి క్షేత్ర స్థాయిలో కేడర్‌ బలమున్నా.. వారిని ముందుకు నడిపించడంలో నాయకత్వం విఫలమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ నాయకత్వం కూడా పార్టీ బలోపేతం, నాయకత్వ సమస్య పరిష్కారంపై ఇంకా దృష్టి సారించడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల్లో ఐదారు శాతం ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్‌కు.. ఇదే పరిస్థితి అసెంబ్లిd ఎన్నికల వరకు కొనసాగితే హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జిల్లాలు తప్పా.. మిగతా జిల్లాలలో పార్టీ శ్రేణులు నిత్యం ఎదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లుతున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని నియోజక వర్గాల్లో ఎన్నో ససమ్యలున్నప్పటికి.. నగరం నాయకులు మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో 119 అసెంబ్లి నియోజక వర్గాలు ఉండగా, కేవలం గ్రేటర్‌ పరిధి 24 అసెంబ్లి నియోజక వర్గాలు, నాలుగు పార్లమెంట్‌ స్థానాలకు విస్తరించి ఉన్నది. అందులో హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లిd నియోజక వర్గాల్లో హస్తం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నది. సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి గతంలో అంజన్‌కుమార్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలోని ఏడు అసెంబ్లిd నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశజనకంగా కనిపించడం లేదు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నుంచి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో హస్తం పార్టీ కేవలం రెండు కార్పోరేట్‌ స్థానాల్లోనే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన కార్పోరేట్‌ ఉప ఎన్నికల్లో మూడో స్థానాన్ని దక్కించుకున్నది. ఇక చేవేళ్ల పార్లమెంట్‌ స్థానంలో గ్రేటర్‌ పరిధికి చెందిన శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌ నియోజక వర్గాలున్నాయి. భువనగిరి లోక్‌సభ పరిధిలోకి ఇబ్రాహీపట్నం అసెంబ్లిd స్థానం వస్తుంది.

కాగా, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో పార్టీ నాయకత్వం బలంగానే ఉన్నప్పటికి మెజార్టీ నియోజక వర్గాలకు నాయకత్వలోటు కనిపిస్తోంది. మేడ్చల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గత ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పొసగడం లేదని, అందుకే కేఎల్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఇకపోతే కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో.. అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వమే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మల్కాజ్‌గిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆక్కడి నుంచి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఉప్పల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి వయోభారం కారణంగా బయటికి రావడం లేదు. గత ఎన్నికల్లో ఆయన తనయుడు బండారి లక్ష్మారెడ్డి కొంత కీలకంగా వ్యవహారించిన ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. కంటొన్మెంట్‌ నియోజక వర్గంలోనూ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశాక.. ఇప్పుడు ఆ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ నాయకుడు లేకపోవడంతో కేడర్‌ సందిగ్ధంలో పడింది.

అసెంబ్లికి ఎన్నికలు వచ్చినప్పుడుల్లా సికింద్రాబాద్‌కు కొత్త అభ్యర్థి రావడం.. స్థానికంగా కాంగ్రెస్‌ పార్టీ పట్టుకోవాల్సి వస్తుంది. వైఎస్‌ హయాంలో జయసుధ పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ముదిరాజ్‌ కుల సంఘం నాయకుడు జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత నుంచి పార్టీలో ఉన్నాడా..? లేడా అనేది అనుమానంగా ఉంది. మాజీ మేయర్‌ బండా కార్తీక్‌రెడ్డి కీలకంగా ఉన్నప్పటికి .. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు. ముషిరాబాద్‌ నుంచి గత ఎన్నికల్లో యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత నియోజక వర్గాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అంబర్‌పేట నియోజక వర్గంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, ఆయన అనుచరులు పార్టీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా అంబర్‌పేట సీటును తెలంగాణ జన సమితికి ఇవ్వడంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ పాగా వేసిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

శేరిలింగంపల్లిలోనూ పార్టీ పరిస్థితి ఆశించినతంగా కనిపించడం లేదు. ఈ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ తనయుడు రవికుమార్‌ బీజేపీలోకి వెళ్లారు. ఇక గోషామహాల్‌ నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ ప్రాతినిధ్యం వహించగా పార్టీ కూడా బలంగా ఉండేది. ముఖేష్‌గౌడ్‌ మరణం తర్వాత ఆయన తనయుడు విక్రమ్‌గౌడ్‌ బీజేపీలోకి వెళ్లడంతో కాంగ్రెస్‌ కేడర్‌ చెల్లాచెదురైంది. ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం వహించే వారు. ఇప్పుడాయన టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడంతో.. నాయకుడు లేని నావగా మారింది. గత ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమి చెందిన దాసోజ్‌ శ్రావణ్‌కుమార్‌ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూబ్లిdహిల్స్‌లో మాజీ మంత్రి పి. జనార్దన్‌రెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్దన్‌రెడ్డి ఉన్నప్పటికీ .. పార్టీ కార్యక్రమాల విషయంలో అంటిముట్టనట్లుగానే వ్యవహారనిస్తున్నారు.

- Advertisement -

గత నెలలో రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉన్నా విష్ణువర్దన్‌రెడ్డి కనీసం గాంధీభవన్‌ వైపు చూడలేదు. ఈ నియోజక వర్గంలో పార్టీ బలంగా ఉన్నప్పటికి నాయకత్వ సమస్యతోనే పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి నియోజక వర్గంలోనూ పార్టీ కేడర్‌ బలంగా ఉన్నా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బలమైన నాయకుడు లేకపోవడం పార్టీ కేడర్‌ ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లిలో పార్టీ సీనియర్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ పార్టీ కార్యక్రమాల్లో బిజీగానే ఉంటూ.. కేడర్‌కు నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు. అయినప్పటికి మజ్లిస్‌ను ధీటుగా ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

ఇక హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లి నియోజక వర్గాల్లో హస్తం పార్టీ అశలు వదుకోవాల్సిందేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక రంగారెడ్డి పరిధిలోని మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. సబితతోనే మెజార్టీ కేడర్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లింది. ఇబ్రాహీపట్నంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీలో కీలంగానే వ్యవహారిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో బీఎస్‌పీ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ చేతిలో స్వల్ఫ ఓట్లతో ఓటమి చెందారు. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చిన మల్‌రెడ్డి రంగారెడ్డి పార్టీలో చురుకుగానే వ్యవహారిస్తున్నారు. ఆయన సోదరుడు మల్‌రెడ్డి రామిరెడ్డి ఎల్బీనగర్‌ నియోజక వర్గ పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లోనూ తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్‌.. పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే కొంత మేరకైనా లాభం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement