భారతీయులందరూ హిందువులేనని, అందరి డీఎన్ఏలో హిందూత్వ ఉందని సంచలన కామెంట్స్ చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్. ఎవరి ఆచార వ్యవహారాలను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పారు. ఇవ్వాల (మంగళవారం) ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా ప్రధాన కార్యాలయం అంబికాపూర్‌లో స్వయంసేవకుల (సంఘ్ వలంటీర్లు) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతదేశ పురాతన లక్షణంగా పదే పదే ఎత్తిచూపారు. ప్రపంచంలో అందరినీ ఏకం చేయడంలో హిందుత్వమే ఏకైక ఆలోచన అన్నారు మోహన్ భగవత్.
భారత్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని తాము 1925 నుండి (ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించినప్పటి నుండి) చెబుతున్నామని, దేశాన్ని తమ మాతృభూమిగా భావించి, భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతితో జీవించాలని కోరుకునే వారు, మతం, సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఈ దిశగా కృషి చేసేవారంతే హిందువులే అన్నారు భగవత్.
హిందుత్వ భావజాలం భిన్నత్వాన్ని గుర్తిస్తుందని, ప్రజల మధ్య ఏకత్వాన్ని విశ్వసిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. భిన్నతలను ఏకీకృతం చేయడాన్ని విశ్వసించే మొత్తం ప్రపంచంలో హిందూత్వ ఏకైక ఆలోచన అనీ.. ఎందుకంటే ఇది ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా ఇటువంటి వైవిధ్యాలను కలిగి ఉందన్నారు. ఇదే నిజమని, ఆర్‌ఎస్‌ఎస్ వలంటీరల్ఉ గట్టిగా నమ్మాలని, ఇదే విషయాన్ని చెప్పాలన్నారు. దాని ఆధారంగా మనం ఐక్యంగా ఉండగలం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తి, జాతీయ స్వభావాన్ని నిర్మించడం.. ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావడం సంఘ్ యొక్క పని అని RSS చీఫ్ తెలిపారు.
ఈ క్రమంలో దేశంలోని అన్ని మత విశ్వాసాలను, వారి ఆచారాలను గౌరవించాలని కూడా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై దేశం మొత్తం ఐక్యంగా పోరాడిందని గుర్తుచేశారు. మన సంస్కృతి మనల్ని కలుపుతుంది. మనలో మనం ఎంత పోట్లాడుకున్నా సంక్షోభ సమయాల్లో ఐక్యంగా ఉంటాం. దేశం ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు కలిసి పోరాడతాం. కరోనావైరస్ మహమ్మారి సమయంలో దేశం మొత్తం దానిని ఎదుర్కోవడానికి ఒకటిగా నిలిచిందని అన్నారు.