వారణాసి : ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ పక్కా వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ ఓటు ఎంతో కీలకమని, క్షేత్ర స్థాయి వరకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. మంగళవారం.. నమో యాప్ ద్వారా.. బీజేపీ కార్యకర్తలకు ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను ఉద్దేశిస్తూ.. దిశా నిర్దేశం చేశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విపక్ష పార్టీల అవినీతిని కూడా ప్రజలకు తెలియజేసేలా చేయాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగీ ప్రభుతం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందో కూడా అర్థం అయ్యే రీతిలో వివరించాలని సూచించారు. కాశీ విశనాథ్ కారిడార్, మహిళా సాధికారత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్‌కేర్ డెవలప్‌మెంట్‌తో పాటు కీలక అంశాలపై బీజేపీ కార్యకర్తలతో మోడీ మాట్లాడారు.
అవగాహన చేపట్టాలి..
ఓటుకు ఉన్న ప్రాముఖ్యతను కూడా తెలియజేయాల్సిన అవసరం బీజేపీ కార్యకర్తలపై ఉందని మోడీ సూచించారు. దీంతో ప్రతీ ఒక్క ఓటు ఎంతో విలువైందన్న విషయం తెలుసుకోవాలన్నారు. పోలింగ్ రోజున ప్రతీ ఒక్కరు ఎన్నికల కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చూడాలని చెప్పుకొచ్చారు. రైతుల కోసం తీసుకొచ్చిన పథకాల గురించి వివరించాలన్నారు. రసాయన రహిత వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న కీలక నిర్ణయాలు, సబ్సిడీలతో పాటు వెసులుబాట్లను కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వారణాసి ప్రజలు పొందిన లబ్ది గురించి ప్రతీ ఒక్కరికి తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను కూడా విజయవంతం చేయాలని సూచించారు. కొంత మంది స్ఫూర్తిదాయకమైన పార్టీ సభ్యులను కలిగి ఉన్న తన యాప్‌లో కమల్ పుష్ప్ విభాగానికి సహకరించాలని పిలుపునిచ్చారు. నమో యాప్‌లో కమల్ పుష్ప్ అనే విభాగం ఉందని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసం విరాళాల సేకరణ కూడా చేపట్టాలన్నారు. ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేసిన తరువాత.. తొలి సారి బీజేపీ కార్యకర్తలతో మోడీ మాట్లాడారు. యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి అవుతాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..