– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
దేశంలోనే అత్యధికంగా గోవాలో మధుమేహ వ్యాధిగ్రస్తులున్నట్లు తాజాగా జరిపిన ఓ పరిశోధనలో వెల్లడయ్యింది. జనాభాలో 26.4 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 4.8 శాతానికి పైగా షుగర్ వ్యాధి బాధితులున్నారు. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీలో ప్రచురితమైంది. ప్రిడయాబెటిస్ మినహా అన్ని జీవక్రియ ఎన్సిడిలు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో అంటువ్యాధిగా పేర్కొంటున్న ఈ షుగర్ వ్యాధి.. ఇతర దేశాల్లో కూడా విస్తరిస్తూనే ఉంది. అయితే భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున షుగర్ బాధితులు పెరగడానికి ఎవరిని నిందించాలన్నది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. భారతదేశంలో ప్రతి 3వ, 4వ వ్యక్తి ప్రీ-డయాబెటిక్ దశకు వెళుతున్నారని, దీన్ని బలహీనమైన గ్లూకోజ్ పరీక్ష-సరిహద్దు స్థితి అని కూడా పిలుస్తామని ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ మహ్మద్ నదీమ్ వెల్లడించారు.
అయినప్పటికీ.. మధుమేహంపై అవగాహన.. నివారణకు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కేన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ వ్యాధులు.. స్ట్రోక్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం (NPCDCS) ప్రభుత్వం అమలులోకి తెచ్చిన అనేక ఆరోగ్య కార్యక్రమాలలో ఉంది. కానీ వ్యక్తిగత జీవనశైలి మార్పులు కారణంగా ఇలాంటి జబ్బులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. భారతదేశంలో మధుమేహం, ఇతర జీవక్రియ వ్యాధుల ప్రాబల్యం గతంలో అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు అధ్యయనంలో నిర్ధారించారు.
మధుమేహం, గుండె జబ్బులు వంటి ఈ నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులకు ప్రధాన కారణం పాశ్చాత్య జీవనశైలి అంటున్నారు వైద్య నిపుణులు. జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వంటి జీవనశైలిని వ్యక్తిగతంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ నదీమ్ చెప్పారు. 2019-2021 కాలానికి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 21 శాతం మందికి రక్తపోటు ఉందని, అదే ఏజ్ గ్రూపులో ఉన్న పురుషులలో 24 శాతం మందికి రక్తపోటు ఉందని తేలింది. అదే అధ్యయనం ప్రకారం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 6.4 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు. సేమ్ ఏజ్ గ్రూపులో ఉన్న పురుషులలో 4 శాతం మంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన డేటా ప్రకారం 7కోట్ల 70 లక్షల మంది భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నారు.