జెనీవా: కరోనా వైరస్ మహమ్మారి విలయానికి భారత్ వణికిపోతోంది. కొన్నివారాలుగా కరోనా కొనసాగుతున్న విజృంభణకు నిత్యం వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృత్యువాత పడుతున్నారు. గతవారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్‌లోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక అదే వారంలో ప్రపంచంలో చోటుచేసుకున్న ప్రతి నాలుగు కొవిడ్ మరణాల్లో ఒకటి భారత్‌లోనే ఉందని WHO పేర్కొంది.
‘ఆసియాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90శాతం కేవలం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వాటిలో ఇది 46శాతం. ఇక ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మొత్తం కరోనా మరణాల్లో 25శాతం భారత్‌లోనే ఉంటున్నాయి’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ గతవారపు నివేదికలలో వెల్లడించింది. ఇక ఇప్పటివరకు అత్యధిక కొవిడ్ మరణాలు (5లక్షల 78వేలు) అమెరికాలో చోటుచేసుకోగా బ్రెజిల్ (4లక్షల 11వేలు) రెండో స్థానంలో ఉంది. భారత్‌లో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 4లక్షలకు చేరడం, నిత్యం మూడున్నర వేల మంది మృత్యువాత పడుతున్నారు. భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య 2కోట్లు దాటగా, మరణాల సంఖ్య 2లక్షల 26వేలు దాటింది.