Tuesday, November 19, 2024

Telangana: ఈవెనింగ్‌ క్లినిక్‌లు సక్సెస్‌.. అందుబాటులో 24 గంటల వైద్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సుదూర ప్రాంతాల నుంచి సర్కారు వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, సామాన్య రోగులకు సాయంకాలపు ఓపీ విధానంతో సకాలంలో వైద్యసేవలు అందుతున్నాయి. వైద్యం అందడంలో ఇప్పటి వరకు నెలకొంటున్న జాప్యానికి పుల్‌స్టాప్‌ పడుతోంది. ఉదయం ఓపీ సేవలను 10 నుంచి మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటలకు పెంచడం, 24గంటలూ ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు తాజాగా తీసుకొచ్చిన ఈవెనింగ్‌ ఓపీ సేవలు పేద, సామాన్య రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేలా దోహదపడుతున్నాయి.

ఉస్మానియా, గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే బడుగు జీవులు సాయంకాలపు ఓపీలో అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈవెనింగ్‌ క్లినిక్‌ల వద్ద క్రమక్రమంగా రోగుల సంఖ్య పెరుగుతోంది. సెలవు దినాల్లో కొంచెం తక్కువగా ఉన్నా పనిదినాల్లో ఈవెనింగ్‌ ఓపీకి పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కాలేజీ వంటి పెద్దాస్పత్రులకు అయితే ప్రతి రోజూ ఈవెనింగ్‌ ఓపీ వైద్యం కోసం 500కు పైగానే రోగులకు వస్తున్నారని వైద్య, వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జులై 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈవెనింగ్‌ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి రోజు సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు ఈవెనింగ్‌ ఓపీ సేవలు అందిస్తున్నారు. ఈవెనింగ్‌ ఓపీలో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్‌, ఆర్థోపెడ్సి స్పెషలిస్టులు అందుబాటులో ఉంటున్నారు.

ఈవెనింగ్‌ ఓపీతోపాటు ఉదయం ఓపీని మధ్యాహ్నం 2 గంటలకు వరకు ప్రభుత్వం పొడిగించడంతో రోగులకు ఎంతో సౌలభ్యంగా ఓపీ సేవలు అందుతున్నాయి. అదే సమయంలో ప్రతి ప్రభుత్వాస్పత్రిలో 24గంటలూ అత్యవసర వైద్యం అందుబాటులోకి రావడం కూడా పేద, సామాన్య రోగులకు వైద్యం అందడం జాప్యం నివారించబడుతోందని రోగులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సుదూర ప్రాంతాల రోగులకు ఎంతో సౌలభ్యంగా
సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం జిల్లా, పట్టణ ఏరియా ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉదయం ఓపీలో వైద్యుడు చూసి టెస్టులు రాస్తున్నారు. ఆ టెస్టులు చేయించుకుని మందులు రాయించుకునేందుకు తిరిగి రోగులు ఆస్పత్రికి వెళితే ఓపీ సమయం అయిపోయిందని, తిరిగి రేపు ఉదయమే రావాలని సిబ్బంది స్పష్టం చేసేవారు. అయితే ఇప్పుడు ఈవెనింగ్‌ క్లినిక్‌లు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి రావడంతో ఉదయం వైద్యుడు పరీక్షించడం ఆతర్వాత టెస్టులు చేయించుకోవడం, వీలుకాకపోతే సాయంత్రం ఓపీలో మందుల చీటి రాయించుకుంటున్నారు. ఇలా ఒక రోజులోనే వైద్య సేవలు అందుతున్నాయని రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈవెనింగ్‌ ఓపీ అందుబాటులో లేనపుడు వైద్యుడిని సంప్రదించాలంటే మరుసటి రోజు ఉదయం వరకు ఆస్పత్రి ఆవరణలోనే వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య లేదని చెబుతున్నారు.

తగినంత ప్రచారమేదీ?
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈవెనింగ్‌ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో ఈవెనింగ్‌ ఓపీ సేవలను జనం వినియోగించుకోలేకపోతున్నారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓపీ బ్లాక్‌లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఈ వైద్య సేవలపై ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, చాలా మందికి ఈవెనింగ్‌ ఓపీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న విషయం ఇప్పటికీ తెలియదని పలు ప్రభుత్వ వైద్య సంఘాలు చెబుతున్నాయి. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈవెనింగ్‌ ఓపీ సేవలను ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం కల్పించాలని సూచిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే రోగుల్లో చాలా మందికి ఈవెనింగ్‌ ఓపీ సేవల గురించి తెలియడం లేదంటున్నారు. అదే ఉదయం ఓపీ సేవలకు ప్రతి ఆస్పత్రిలో కనీసం 800 నుంచి 1500దాకా వస్తున్నారు. అయితే అందరికీ ఈవెనింగ్‌ ఓపీ అలవాటు కాకపోవడంతో పొద్దున్నే వచ్చి చెకప్‌ చేయించుకుని వెళ్లిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement