కొద్ది రోజులుగా రాష్ట్రంలో మిర్చి ధరలు అమాంతం పెరగుతున్నాయి. మిర్చికి వేలల్లో ధర పలుకుతున్నా సమయానికి పంటలేదని రైతులు నిట్టూర్చుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో గతంకంటే అదనంగా 3.50లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగైంది. పంట మొదటి దశలో బాగానే ఉన్నా తరువాత వచ్చిన అకాల వానలు, అనంతరం సోకిన వైరస్‌లు మిర్చి రైతుల జీవితాల్నే మార్చేసాయి. ఈ ఏడాది మిర్చికి సోకిన వైరస్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తోటలన్నింటిని రైతులు మధ్యలోనే తీసేసి, వేరే పంటలు సాగు చేశారు. వాస్త వానికి ఎలాంటి వైరస్‌లు లేకపోతే ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా, వ్యాధుల బెడదతో ఈ సారి దిగు బడి పూర్తిగా తగ్గి, పెట్టుబడి కూడా వచ్చే పరి స్థితులు లేవని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధర ఉన్నా.. పంట లేదు..
మిర్చిలో పలు రకాల విత్తనాలు ఉండడంతో తేజ రకం కాకుండా మిగతా రకాలకు సైతం క్వింటా రూ.25వేలు ధర పలుకుతుంది. తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పంట వరంగల్, ఖమ్మంలో అత్యధికంగా సాగవుతుండగా, మిగతా జిల్లాల్లో నామమాత్రంగానే సాగవుతుంది. ప్రస్తుతం వరంగల్, ఖమ్మం మార్కెట్లకు మిర్చి పోటెత్తుతుంది. రోజుకు సుమారు 60 వేల బస్తాలు వస్తుండడంతో మార్కెట్ మొత్తం ఎరుపు రంగును పులుముకుంటున్నాయి. ప్రస్తుతం మిరపకు మంచి ధరే పలుకుతున్నా ఆశించిన మేర రైతుల దగ్గర పంట లేకపోవడం గమనార్హం. ఇదే సమయంలో మన దగ్గర నుంచి విదేశాలకు మిర్చిని ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో ఈ సారి పంట తగ్గడంతో డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ తోనే అంతర్జాతీయ స్థాయిలో మిర్చికి ధర పలుకుతుంది.
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి అమెరికా, శ్రీలంక, రష్యాలకు ప్రధానంగా మిర్చిని ఎగుమతి చేస్తున్నాం. ఇవీ కాక మరికొన్ని దేశాల్లో మన మిర్చికి డిమాండ్ ఉంది. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రాగా, అందులో కేవలం 3లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మన అవసరాలకు వినియోగించగా మిగతా 9 లక్షల మెట్రిక్ టన్నులు విదేశాలకు ఎగుమతి జరిగేది.
వరంగల్‌లోనూ అ’ధర’హో..
ఖమ్మం మార్కెట్‌తో పాటు వరంగల్ మార్కెట్‌లోనూ మిర్చికి మంచి ధరే పలుకు తుంది. గురువారం తేజ రకం క్వింటా రూ.18,800 పలుకగా, శుక్రవారం కూడా అదే ధర కొనసాగింది. అయితే గురువారం అన్ని రకాల మిర్చి కలుపుకుని 17, 808 బస్తాలు మార్కెట్‌కు రాగా, శుక్రవారం 17,651 బస్తాలు, బుధవారం నాడు 18,500 ధర పలుకగా, 14,305 బస్తాలు వచ్చాయి. అయితే వరంగల్ జిల్లాలో తేజ రకంతో పాటు వివిద రకాల మిర్చిని రైతులు సాగు చేస్తున్నారు. వీటిలో కొన్ని రకాలకు క్వింటా రూ.25వేలు పలకడం విశేషం. ప్రస్తుతం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో తేజ రకం క్వింటా రూ.18,800 ధర పలుకుతుండగా.. వండర్ హాట్ రూ.22,500, యు.ఎస్ 341 రకం రూ.25,000, డీడీ రకం రూ.23 వేలు, దేశీ మిర్చి రకం రూ.25 వేలు, 1048 రకం రూ.19,000 ధరలతో ఉన్నాయి..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..