ఫేమ్-2 సబ్సిడీ కోతతో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇండస్ట్రీ 3 వేల కోట్ల పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని కోరుతోంది. సబ్సిడీ కోత ప్రభావం పరిశ్రమపై దారుణంగా ఉందని సొసైటీ ఆఫ్ మన్యూఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఎంఈవీ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఎస్‌ఎంఈవీ లేఖ రాసింది. వివిధ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యూఫ్యాక్చరర్స్ (ఓఈఎ ం)లకు ఇప్పటి వరకు 1200 కోట్లకు పైగా రాయితీలు నిలిచిపోయాయని తెలిపింది. 18 నెలలుగా ఈ సబ్సిడీ కోసం కంపెనీలు ఎదురు చూస్తున్నాయని తెలిపింది.
సబ్సిడీలను నిలిపివేయడంతోపాటు, భవిష్యత్ విక్రయాలకు అనుమతి ఇవ్వకపోవడంతో స్టార్టప్‌లు, మొదటిసారి ఈ రంగంలోకి వచ్చిన వారికి ఇబ్బందిగా ఉందని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ చెప్పారు. దీని వల్ల చాలా కంపెనీలు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటకపడలేకపోతున్నాయని చెప్పారు. సబ్సిడీల నిలిపివేతతో దెబ్బతిన్న కంపెనీల కు ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు పునరావాస నిధులను సమకూర్చాలని, ఇందుకు 3000 కోట్ల రూపాయలను కేటాయించాలని ఈ లేఖలో ఆర్ధిక మంత్రిని కోరారు.
సబ్సిడీలు రాకపోవడంతో చాలా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సంస్థలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కొన్నింటిలో ఉత్పత్తి నిలిచిపోయిందని, అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని తెలిపారు. చాలా సంస్థల డీలర్ షిప్స్ మూతపడ్డాయని, బుకింగ్స్ కాన్సిల్ అయ్యాయని పేర్కొననారు. కార్మికులకు పని పోయిందని, మార్కెట్‌లో కంపెనీలకు అవకాశాలు దెబ్బతిన్నాయని, మార్కెట్ వాటా తగ్గిపోయిందని, వాటికున్న ఇమేజ్ పోయిందని, ఇలా మొత్తంగా చూస్తే పరిశ్రమ 30వేల కోట్ల వరకు నష్టపోయిందని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ రంగంలో ఇన్వెస్టర్లపై మరింత దారుణమైన ప్రభావం పడిందని పేర్కొంది. ఈ పరి ణామాలతో బ్యాంక్‌లు కూడా రుణాలు ఇవ్వడానికి అంగీకరించడంలేదని తెలిపారు. ఈ దశలో పరిశ్రమ నిలబడేందుకు ప్రభుత్వం పునరావాస నిధిని నెలకొల్పి ఆదుకోవాలని ఎస్‌ఎంఈవీ ఈ లేఖలో ఆర్ధిక మంత్రిత్వ శాఖను కోరింది.
భారీ పరిశ్రమల శాఖ జూన్ 1 నుంచి ఫేమ్ 2 సబ్సిడీ ని 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. దీని వల్ల జూన్ 1 నుంచి అన్ని కంపెనీలు ఈవీ టూ వీలర్ ధరలను పెంచాయి. ఫేమ్ సబ్సిడీని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేశాయని వెల్లడికావడంతో ప్రభుత్వం సబ్సిడీ మొత్తాలను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. చాలా కంపెనీలు సబ్సిడీని కస్టమర్లకు అందించకుండా ఆ మేరకు కృత్రిమంగా ధర పెంచి విక్రయించాయి. కొన్ని కంపెనీలకు ప్రభుత్వం దీనిపై ఇప్పటికే నోటీస్‌లు ఇచ్చింది. కొన్ని కంపెనీలను ఫేమ్ సబ్సిడీ జాబితా నుంచి తొలగించింది. మరికొన్ని కంపెనీలపై జరిమానా విధించింది.