మంకీపాక్స్ మహమ్మారిగా మారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే 72 దేశాల్లో 16వేల మందికి సోకింది. భారత్‌లోనూ నాలుగు కేసులను ధృవీకరించారు వైద్య అధికారులు. అందులో కేరళలో విదేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో లక్షణాలు కనిపించాయి. మరొకటి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కూడా ఇట్లాగే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో బయటపడింది. ఇక.. ఈ అంటువ్యాధికి వ్యాక్సిన్ కనుగొనే పనిలోపడ్డారు వైద్యనిపుణులు. కాగా, మశూచీ (స్మాల్‌పాక్స్) కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ‘ఇమ్వానెక్స్’ని మంకీపాక్స్‌కి వాడాలని యురోపియన్ యూనియన్ నిర్ణయించింది.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత ఈ అంటువ్యాధిని అరికట్టేందుకు మశూచి వ్యాక్సిన్‌ను ఉపయోగించాలని యూరోపియన్ యూనియన్ (EU) ఆమోదించింది. ఈమేరకు డ్రగ్‌ని అభివృద్ధి చేసిన డానిష్ డ్రగ్‌మేకర్ బవేరియన్ నార్డిక్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. యురోపియన్ యూనియన్ (EU) ఔషధాల సిఫారసుకు తగ్గట్టు ఐరోపా కమిషన్ కంపెనీకి చెందిన మశూచి వ్యాక్సిన్ ‘‘ఇమ్వానెక్స్’’ కు మార్కెటింగ్ అధికారాన్ని పొడిగించారని బవేరియన్ నార్డిక్ తెలిపారు.
కాగా, అన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో పాటు ఐస్లాండ్, లీచ్టెన్స్టెయిన్, నార్వేలో ఈ డ్రగ్ వినియోగానికి పర్మిషన్ ఇచ్చింది.– మశూచి నివారణ కోసం 2013 నుండి EUలో ఇమ్వానెక్స్ (Imvanex) ఆమోదంలో ఉంది. మంకీపాక్స్ వైరస్, మశూచి వైరస్ల మధ్య దగ్గర సంబంధం ఉన్నందున మంకీపాక్స్ ని అరికట్టేందుకు పనికొచ్చే వ్యాక్సిన్‌గా దీన్ని వైద్య నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.
1980లో నిర్మూలించిన మశూచి కంటే మంకీపాక్స్ తక్కువ ప్రమాదకరమైనదని, కాకపోతే అంటువ్యాధిగా కొనసాగుతోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఐదు రోజుల వ్యవధిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పితో పాటు.. కోతుల మాదిరిగా దద్దుర్లు వస్తాయని చెబుతున్నారు. ఆ తర్వాత ముఖంపై, అరచేతులు, అరికాళ్లపై బొబ్బులు కనిపిస్తాయి. గాయాలు, మచ్చలు, చివరకు స్కాబ్ల మాదిరిగా మారతాయి. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల గత మే నెల నుండి పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల బయట కనిపించిందని, ఈ వ్యాధి చాలా కాలంగా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తోంది.