Friday, November 22, 2024

Spl Story: మంకీపాక్స్​కి వ్యాక్సిన్​ రెడీ.. మశూచీ టీకానే వాడుతున్న యూరప్ దేశాలు​

మంకీపాక్స్​ మహమ్మారిగా మారి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే 72 దేశాల్లో 16వేల మందికి సోకింది. భారత్​లోనూ నాలుగు కేసులను ధృవీకరించారు వైద్య అధికారులు. అందులో కేరళలో విదేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో లక్షణాలు కనిపించాయి. మరొకటి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో కూడా ఇట్లాగే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలో బయటపడింది. ఇక.. ఈ అంటువ్యాధికి వ్యాక్సిన్​ కనుగొనే పనిలోపడ్డారు వైద్యనిపుణులు. కాగా, మశూచీ (స్మాల్​పాక్స్​) కోసం తయారు చేసిన వ్యాక్సిన్​ ‘ఇమ్వానెక్స్​’ని మంకీపాక్స్​కి వాడాలని యురోపియన్​ యూనియన్​ నిర్ణయించింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత ఈ అంటువ్యాధిని అరికట్టేందుకు మశూచి వ్యాక్సిన్‌ను ఉపయోగించాలని యూరోపియన్ యూనియన్​ (EU) ఆమోదించింది. ఈమేరకు డ్రగ్​ని అభివృద్ధి చేసిన డానిష్ డ్రగ్‌మేకర్ బవేరియన్​ నార్డిక్​ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. యురోపియన్​ యూనియన్​ (EU) ఔషధాల సిఫారసుకు తగ్గట్టు ఐరోపా కమిషన్ కంపెనీకి చెందిన మశూచి వ్యాక్సిన్ ‘‘ఇమ్వానెక్స్’’ కు మార్కెటింగ్ అధికారాన్ని పొడిగించారని బవేరియన్ నార్డిక్  తెలిపారు.

కాగా, అన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో పాటు ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వేలో ఈ డ్రగ్​ వినియోగానికి పర్మిషన్​ ఇచ్చింది.– మశూచి నివారణ కోసం 2013 నుండి EUలో ఇమ్వానెక్స్​ (Imvanex) ఆమోదంలో ఉంది. మంకీపాక్స్ వైరస్, మశూచి వైరస్​ల మధ్య దగ్గర సంబంధం ఉన్నందున మంకీపాక్స్ ని అరికట్టేందుకు పనికొచ్చే వ్యాక్సిన్​గా దీన్ని వైద్య నిపుణులు సజెస్ట్​ చేస్తున్నారు.

1980లో నిర్మూలించిన మశూచి కంటే మంకీపాక్స్ తక్కువ ప్రమాదకరమైనదని, కాకపోతే అంటువ్యాధిగా కొనసాగుతోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఐదు రోజుల వ్యవధిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పితో పాటు.. కోతుల మాదిరిగా దద్దుర్లు వస్తాయని చెబుతున్నారు. ఆ తర్వాత ముఖంపై, అరచేతులు, అరికాళ్లపై బొబ్బులు కనిపిస్తాయి. గాయాలు, మచ్చలు, చివరకు స్కాబ్‌ల మాదిరిగా మారతాయి. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల గత మే నెల నుండి పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల బయట కనిపించిందని, ఈ వ్యాధి చాలా కాలంగా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement