Friday, November 22, 2024

ఈటల బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 14న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా ఈటల బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన బీజేపీలో పెద్దలతో చర్చలు జరిపారు. పార్టీ ఆగ్ర నేతల అపాయింట్ మెంట్ ఫిక్స్ కావడంతో ఈ నెల 14న ఈటల కాషాయ కండువా కప్పుకొనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను అందించేందుకు స్పీకర్ అపాయింట్ మెంట్ కోరినా ఆయన ఇంకా ఇవ్వలేదు.

భూ కబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తరువాత ఈటల వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది. ఈటల సొంతంగా పార్టీ పెడతారని.. లేదంటే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈటల తన సన్నిహితులతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈటల బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనపై కావాలనే కక్ష్య కట్టి కేసీఆర్‌ పార్టీ నుంచి బయటకు పంపారని ఈటల ఆరోపించారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురు అయిన మౌనంగా ఉన్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ కు తనకు మధ్య ఐదేళ్లుగా గ్యాప్ ఏర్పడిందని చెప్పారు. భూ కబ్జా ఆరోపణలపై తన అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు కాషాయ పార్టీలో చేరనున్నారు.

మరోవైపు ఈటల ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ పోచారం ఈటల రాజీనామాను ఆమోదం తెలిపితే.. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈటలను రాజకీయంగా ఒంటరిని చేయాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈటల వెంట టీఆర్ఎస్ నాయకులు వెళ్లకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మంత్రులు హరీష్‌ రావు, గంగుల కమలాకర్ లు స్థానిక నాయకులతో వరుస భేటీలు అవుతున్నారు. హుజురాబాద్ లో బీజేపీకి ఉన్న బలంపై నాయకులు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువగా 2 వేలలోపు ఓట్లు పోలు కాగా, ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఈటలతో బలం పెరుగుతుందే తప్ప బీజేపీ వల్ల ఈటలకు ఉపయోగం లేదని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల ఇమేజ్‌ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు.

అయితే, టీఆర్ఎస్ ఎత్తులను ఈటల చిత్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ఆత్మగౌవరం పేరుతో ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, టీఆర్ఎస్ తో తనకున్న 20 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకునే వరకు వెళ్లిన అంశాలను సైతం ప్రజలకు వివరిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఏర్పాటు చేసిన సమావేశంలోనూ జై ఈటల అంటూ ఆయన మద్దతుదారులు హంగామా చేశారు. నియోజకవర్గంలో ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తనదే అనే ధీమాలో ఈటల ఉన్నారు. తనను ఓడించేందుకు ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చలు చేశారంటూ సంచలన ఆరోపణలు సైతం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కురుక్షేత్రం లాంటిదని, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే యుద్ధం లాంటిదని ఈటల అభివర్ణించారు. ఈ ఎన్నికలో అంతిమంగా హుజురాబాద్ ప్రజలే గెలుస్తారని, సీఎం కేసీఆర్ కు స్థానిక ప్రజలు బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. మొత్తం మీద బీజేపీలో చేరిన తర్వాత ఈటల ఇంకా ఎలాంటి దూకుడుతో వ్యవహరిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

ఇదీ చదవండి: అమెరికాలో చైనీస్‌ యాప్స్‌పై నిషేధం ఎత్తివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement