Friday, November 22, 2024

ఈటల వల్లే దళిత బంధు: ఈటల జమున

హజురాబాద్ ఉపఎన్నిక వేళ.. మాజీ మంత్రి ఈటల బావమరిది చాటింగ్ కలకలం రేపింది. దళితులను అవమానించేలా చాట్ చేశారని ఈటల బావమరిది మధుసూదన్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. అయితే, ఇవీ ఫేక్ చాట్‌ అంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల ఆందోళనలతో హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది.

దళితులంటే తమకు అపారమైన గౌరవం ఉందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అన్నారు. ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను అవమానపరిచినట్టు ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహానికి ఈటల సతీమణి జమున పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు వారి బానిసలు ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత బంధు హుజూరాబాద్ తో పాటు రాష్ట్ర మంతా ఇవ్వాలన్నారు. నమస్తే తెలంగాణ అబద్ధాలు రాస్తుందని చెప్పారు. ఆ పత్రికను చదవ వద్దు అని పిలుపునిచ్చారు. ప్రజల్లో కొట్లాడదాం కానీ ఇలాంటి పనులు చేయవద్దని హితవు పలికారు. దళిత బంధు ఈటెల రాజేందర్ రాజీనామా వల్లనే వచ్చిందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని ఈటల జమున డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement