తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళా యూనివర్సిటీ లేదు. దీంతో కోఠి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మారుస్తూ ఇవ్వాల జీవో జారీ చేసింది. దీంతో ఎంతో మంది స్టూడెంట్స్‌కి ఇక ఇబ్బందులు తప్పినట్టే అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అమ్మాయిలకు ఉన్నతవిద్యలో అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మహిళా విద్యాభివృద్ధి లక్ష్యంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1983లో తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చారు. తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ యువతులకు సామాజిక, సాంకేతిక, వైజ్ఞానిక శాస్త్ర రంగాల్లో అరుదైన కోర్సులను అభ్యసించే అవకాశం లభించింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆడపడుచులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం లేకపోవడంతో చాలా విమర్శలొచ్చాయి.
ఫుడ్ అండ్ న్యూట్రీషన్, ఆర్కిటెక్ట్ తదితర కోర్సుల్లో తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేకపోవడం వల్ల కొందరు ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోంది. అమ్మాయిలను ఉన్నత చదువు కోసం బయట రాష్ట్రాలకు పంపడానికి చాలా కుటుంబాలు అభ్యంతరం తెలపడంతో ఆడపిల్లల కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. కాగా, కోఠి ఉమెన్స్ కాలేజీని అమ్మాయిలకు ఉచిత ఉన్నత విద్యావకాశాలను కల్పించడం ద్వారా వాళ్లకు మరింత మేలు కలుగుతుందని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది.