Tuesday, November 26, 2024

రాష్ట్ర స‌హకారం మేర‌కే ఎయిర్‌పోర్టుల ఏర్పాటు.. వ‌రంగ‌ల్‌కు హృద‌య్ ఫండ్స్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రతిపాదిత ఆరు నూతన ఎయిర్‌పోర్టుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల మీదే ఆధారపడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్‌ వీకే సింగ్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, మాలోతు కవిత, పసునూరి దయాకర్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఇప్పటికే మూడు గ్రీన్‌ ఫీల్డ్, మూడు బ్రౌన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన టెక్నో ఫీజిబిలిటీ తుది నివేదికను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.

సోలార్ పార్క్‌ల నిర్మాణం
40 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని 50 సోలార్‌ పార్కుల నిర్మాణం చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అల్ట్రా మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం జాతీయ సోలార్‌ మిషన్‌ పథకం అమలు జరుగుతోందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 4292.37 మెగావాట్లు, తెలంగాణలో 4,028.01 మెగావాట్ల కెపాసిటీతో సౌరవిద్యుత్‌ శక్తి ఏర్పాటు చేశామని చెప్పారు.

హృదయ్ పథకం కింద వరంగల్‌కు నిధులు
హృదయ్ పథకం కింద వరంగల్‌కు నగరానికి రూ.40.54 కోట్ల నిధులు కేటాయించామని కేంద్రం తెలిపింది. అందులో భాగంగా రూ.32.82 కోట్లు విడుదల చేశామన్న కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్‌ కిశోర్‌ చెప్పారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్‌ సమాధానమిచ్చారు. హృదయ్‌ పథకం కింద చేపట్టిన కార్యక్రమాల్లో భద్రకాళి చెరువు సుందరీకరణ అభివృద్ధి, వెయ్యి స్తంభాల ఆలయ ప్రాంతంలో అభివృద్ధి పనులు, కాజీపేట దర్గాలో అభివృద్ధి పనులు, పద్మాక్షి దేవాలయం వద్ద చెరువు పునర్నిర్మాణం, హన్మకొండ జైన్‌ స్థలాల అభివృద్ధి పనులు పూర్తయ్యాయన్న కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. వరంగల్‌ కోట పునరుద్ధరణ, అభివృద్ధి పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. 2015లో ప్రారంభమైన నేషనల్‌ హెరిటేజ్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆగ్మెంటేషన్‌ యోజన (హృదయ్‌) 2019 మార్చి 31తో ముగిసింది.

కొనసాగుతున్న గృహాల నిర్మాణం
తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఎవై–యు) కింద మంజూరైన అన్ని గృహాల పనులు కొనసాగుతున్నాయని, 1,98,654 గృహాల నిర్మాణం పూర్తైందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్‌ కిశోర్‌ వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఐదేళ్లలో రూ.87596.84 కోట్లు పీఎంఎవై–యు కింద నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మొత్తం రూ.76,308.97 కోట్లు వినియోగం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. పీఎంఎవై–యు కింద గృహాల వాస్తవ డిమాండ్‌ను అంచనా వేయడానికి 2.25 లక్షల ఇళ్ల డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌ 22వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2,26,166 గృహాలు మంజూరు చేశామని, 2016–17 నుంచి 2020–21 మధ్య గత ఐదేళ్లలో పీఎంఎవై–యు కింద తెలంగాణలో 1,84,913 గృహాలు మంజూరు చేసినట్లు కౌశల్ కిషోర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement