ఓ ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా బంధం పెరిగింది. కానీ, వారి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. బలవంతంగా మరో యువకుడితో ఆమెకు వివాహం జరిపించారు. ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, కట్టుకున్నోడిని కాదనుకోలేక ఆ యువతి సాహసమే చేసింది. ఆఖరికి మొగుడిని గాలికి వదిలేసి ప్రియుడితోనే ప్రేమాయణం కొనసాగిస్తోంది. భర్తను కాదనుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన కూతురి వైవాహిక జీవితానికి అడ్డుపడుతున్న ఆ వ్యక్తిని ఎలాగైనా చంపాలని ఆమె తండ్రి నిశ్చయించుకున్నాడు. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్‌కు చెందిన నీలం శ్రీనివాస్ (45)కు శిరీష అనే కూతురు ఉంది. వేములవాడ పట్టణం సుభాష్ నగర్‌కు చెందిన చింతలతండం మనోజ్ కుమార్‌ను శిరీష కొంతకాలం నుంచి ప్రేమిస్తోంది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో.. మందలించారు. శిరీషకు మరొకరితో వివాహం చేశారు. అయినప్పటికీ మనోజ్‌ను మరిచిపోలేక పోయింది.. ఆమె ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో అతను కూడా తనకు శిరీష వద్దని తెగేసి చెప్పాడు.
ప్రియుడితో కలిసి ముంబైకి..
కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయిన శిరీష, తన ప్రియుడు మనోజ్‌తో కలిసి ముంబైకి వెళ్లింది. అక్కడ వారం రోజుల పాటు ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగొచ్చింది. భర్త కూడా ఆమెను వద్దనుకోవడంతో తల్లిదండ్రులతోనే తిప్పాపూర్‌లో ఉంటోంది. మనోజ్‌ను విడిచి పెట్టాలని పెద్దలు చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. కాగా, శిరీష వైవాహిక జీవితాన్ని సెటిల్ చేసేందుకు ఆమె తండ్రి ఓ ప్లాన్ చేశాడు. మనోజ్‌ను చంపేందుకు కుట్ర పన్నాడు. దీంతో నీలం శ్రీనివాస్ తన స్నేహితుడైన మనుక కుంటయ్యకు మనోజ్ ఫొటోను వాట్సాప్‌లో పంపి.. అతని హత్యకు సిద్ధం కావాలని చెప్పాడు. వీరిద్దరూ కలిసి బిహార్‌కు చెందిన లిఖింద్ర సాహ్ని, కోరుట్ల వాసి బొమ్మిడి రాజ్‌కుమార్‌తో కలిసి 5 లక్షలకు సుపారీ ఒప్పందం చేసుకున్నారు.
బెడిసికొట్టిన మనోజ్ హత్య ప్లాన్..
అయితే ఒప్పందం మేరకు గురువారం మనోజ్ కదలికలను గమనిస్తూ తిప్పాపూర్‌లో తిరుగుతుండగా… ఇదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులకు వారు తారసపడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వారు యత్నించినప్పటికీ.. దొరికిపోయారు. వారి కారును తనిఖీ చేయగా అందులో రెండు కత్తులు దొరకడంతో పోలీసులు సుపారీ బృందాన్ని అరెస్టు చేశారు. వారిని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వెల్లడించారు. సుపారీ బృందం నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, కారు, బైక్, మనోజ్ ఫొటో, 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.