కరోనా బారిన పడకుండా ఉండేందుకు గత ఏడాది నుంచి ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు వినియోగిస్తున్నారు. అయితే మాస్కులను ఉపయోగించిన తర్వాత పలువురు ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ఈ క్రమంలో వాడి పడేసిన మాస్కుల వల్ల విపరీతమైన చెత్త పేరుకుపోతుండగా జీవరాశికి అపార నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళూరుకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ లవర్ నితిన్ వాస్ తన ‘పేపర్ సీడ్ కో’ సంస్థ ద్వారా ఓ మాస్క్ రూపొందించి పర్యావరణహిత పరిష్కారం చూపించాడు. నితిన్ రూపొందించిన మాస్క్ వైరస్ నుంచి కాపాడటమే కాకుండా, దాన్ని నేల మీద పారేస్తే అది ఓ మొక్కగా వృద్ధి చెందడం విశేషం.
ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్న కాటన్ మాస్క్‌లు వాస్తవానికి రీ సైకిల్ రాగ్స్(క్లాత్ పీసెస్)తో తయారవుతాయని నితిన్ తెలిపాడు. దీంతో వస్త్ర పరిశ్రమ నుంచి సేకరించిన కాటన్ ప్లప్, వివిధ స్క్రాప్ పదార్థాలను ఉపయోగించి మాస్క్ ఔటర్ కవర్ తయారు చేశాడు. లోపలి లైనింగ్‌ను మృదువైన పత్తి వస్త్రంతో తయారు చేశాడు. ఈ మాస్కులు తగినంత మందంగా ఉండటంతో, ఇన్‌ఫెక్షన్స్ రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటాయి. కాటన్ (పత్తి)తో తయారైన ఈ మాస్కులను ఒకసారి ఉపయోగించిన తర్వాత మట్టిలో పూడ్చి, కొద్దిగా నీరు పోస్తే కొద్ది రోజుల్లోనే అది మొక్కగా పెరుగుతుందని నితిన్ వివరించాడు. అయితే ఈ మాస్కులను తయారు చేసేందుకు రూ.25 ఖర్చవుతుందని తెలిపాడు. ఈ మాస్కులను యంత్రాలతో కాకుండా చేతితోనే తయారుచేస్తున్నాయని, దీని కోసం స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నాడు. అందుకే ఈ మాస్కుల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నాడు. ఇది లాభార్జనే ధ్యేయంగా చేస్తున్న పని కాదని… పర్యావరణహితం కోసం కష్టపడుతున్నామని తెలిపాడు.