Tuesday, November 26, 2024

ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, జులై 21, 22న లాసెట్‌.. మిగ‌తా ఎగ్జామ్స్ ఎప్పుడంటే..

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : ఆన్‌లైన్‌ పద్ధతిలో డిగ్రీ, పీజీ కోర్సులలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ప్రకటించింది. లాసెట్‌(మూడేళ్లు), టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ (ఐదేళ్లు), టీఎస్‌ ఎడ్‌సెట్‌, టీఎస్‌ ఐసెట్‌, టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి మంగళవారం ప్రకటించారు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి కావలసిన విద్యార్హత, చెల్లించవలసిన రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఇతర వివరాలతో నోటిఫికేషన్‌ను సెట్‌ కన్వీనర్లు ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తారని తెలిపారు.
పరీక్ష తేదీ కోర్సు నిర్వహించే వర్శిటీ

జులై 21న లాసెట్‌ (మూడేళ్ల కోర్సు) ఉస్మానియా వర్శిటీ
జులై 22న లాసెట్‌ (ఐదేళ్ల కోర్సు) ఉస్మానియా వర్శిటీ
జులై 22న పీజీఎల్‌సెట్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఉస్మానియా వర్శిటీ
జులై 26,27న ఎడ్‌సెట్‌ ఉస్మానియా వర్శిటీ
జులై 27,28 ఐసెట్‌ కాకతీయ వర్శిటీ
జులై 29-ఆగస్టు1 పీజీఈసెట్‌ ఉస్మానియా వర్శిటీ

ప్రవేశ పరీక్షలకు ఈసారి అభ్యర్థుల నుంచి భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది నిర్వహించిన ఐసెట్‌ పరీక్షను మొత్తం 56,962 మంది రాయగా, 51,316 మంది అర్హత సాధించారు. టీఎస్‌ పీజీసెట్‌ పరీక్షకు 18,274 మంది హాజరుకాగా, అందులో 16,582 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అదేవిధంగా మూడేళ్ల లా కోర్సు అయిన లాసెట్‌ ప్రవేశ పరీక్షను 21,160 మంది రాయగా, 14,017 మంది అర్హత పొందారు. ఐదేళ్ల లాసెట్‌కు 5,793 మంది హజరైతే 3,846 మంది అర్హత సాధించారు. పీజీఎల్‌సెట్‌ పరీక్షను 2,676 మంది రాస్తే 2,535 మంది అర్హత పొందారు. ఎడ్‌సెట్‌ పరీక్షకు 34,185 మంది హాజరైతే 33,683 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెట్స్‌ పరీక్ష తేదీల్లో ఇతర వేరే పరీక్షలేవైనా ఒకేరోజు ఉంటే సెట్స్‌ తేదీలను వీలునుబట్టి మార్చుతామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. దరఖాస్తు ఫీజును పెంచలేదన్నారు. కొత్త కాలేజీలు పెరగలేదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ వి.వెంకట రమణ, సెక్రటరీ డా.ఎన్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించిన నెల రోజుల్లోపు ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement