– ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి
హైదరాబాద్ మహానగరం చుట్టూరా విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీలు దండిగా ఉన్నాయి. రవాణా వ్యవస్థ ఉండటంతో ఈ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లోనే ఎక్కువమంది విద్యార్థులు చేరుతున్నారు. అయితే.. కాలేజీల యాజమాన్యాలు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినా, ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల
పరిధిలో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్, ఇబ్రహీంపట్నం, శామీర్‌పేట, కీసర, మేడ్చల్ ప్రాంతాల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి.
శివార్లలో ఈ కాలేజీలు ఉండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. గతంలో ఫీజులు అందుబాటులో ఉండేవి. రానురాను ఫీజులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇంజనీరింగ్ పూర్తి చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఖరీదైన కాలేజీలు మనవే..
ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు ఎక్కువ శాతం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కాలేజీల్లోనే పెరిగాయి. అత్యధిక ఫీజులు పెరిగిన కాలేజీలు కూడా మనవే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఫీజు పెరిగిన కాలేజీగా మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ)రికార్డు సృష్టించింది. ఈ కాలేజీలో ఫీజు రూ. 1.60లక్షలకు చేరింది. అత్యధిక ఫీజులు ఇదే కావడం గమనార్హం. తరువాతి స్థానంలో ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న సీవీఆర్ కాలేజీ ఉంది. ఇక్కడ రూ. 1.50లక్షలకు చేరింది. మూడో స్థానంలో సీబీఐటీ (నార్సింగి), వర్థమాన్ (శంషాబాద్), వాసవి (ఇబ్రహీంబాగ్)ఇంజనీరింగ్ కాలేజీలు నిలిచాయి. ఇక్కడ ఫీజు రూ. 1.40లక్షల వరకు పెరిగింది. ఫీజులు పెరిగిన కాలేజీలు టాప్ 5లో ఉన్నాయి.
ఫీజులతో సంబంధం లేకుండా చాలామంది ఈ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడుతుంటారు. ఈ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లు కూడా ఎక్కువగా ఉండటంతో చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను ఇందులో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డబ్బున్న వాళ్లు ఫీజులను లెక్క చేయకుండా పేరున్న కాలేజీల్లోనే తమ పిల్లలను చేర్పిస్తున్నారు. మధ్యతరగతి వర్గాల ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కాలేజీలను వెతుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి.