Friday, November 22, 2024

Drug Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు తెర.. ఎలాంటి ఆధారాలు సేకరించని ఈడీ!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుకు తెర పడినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. డ్రగ్స్ దిగుమతితో పాటు నిధుల మళ్లింపు వ్యవహారం దర్యాప్తు చేపట్టింది. అయితే, వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసేయాలని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అవసరమైన చట్టపరమైన ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 2017లో ఆబ్కారీశాఖ నమోదు చేసిన కేసులతో తెలుగు చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. సుదీర్ఘంగా సాగిన ఈ దర్యాప్తులో సరైన ఆధారాలు లభించకపోవడంతో ఇప్పుడీ కేసుకు మూసివేయాలని ఈడీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం 2017లో తెరపైకి వచ్చింది. ఎక్సైజ్‌ శాఖ కెల్విన్ మార్కెరాన్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతడి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతడు చెప్పడంతో కలకలం రేగింది. ఈ కేసులో పలువురు ప్రముఖ సినీ నటులను విచారించారు. డ్రగ్స్ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరిలో కొందరి నుంచి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపారు. కొందరు సాక్షులను కూడా విచారించారు. అయితే, ఇన్నిచేసినా డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా దీనిపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్ దర్యాప్తు ముగిసిన తరుణంలో ఈడీ అధికారులు తెరపైకి వచ్చారు.

ఈ వ్యవహారంపై గత ఆగస్టులో కేసు నమోదు చేసి డ్రగ్స్‌ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, రవితేజ, రానా, ఛార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ వంటి 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. ఆగస్టు 31న మొదలైన ఈ విచారణ సెప్టెంబరు 22 వరకూ కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని మూసివేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement