Tuesday, November 26, 2024

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఎఫ్ క్లబ్ చుట్టూ నడిచిన వ్యవహారం!

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో గతంలో అరెస్ట్ అయిన నిందితులను ఈడీ వేర్వేరుగా విచారించింది. ముగ్గురి స్టేట్‌మెంట్‌ల ఆధారంగా విచారణను ఈడీ తీవ్ర తరం చేసింది. డ్రగ్స్‌ను ఎలా కొన్నారు ? ఎవరికిచ్చారు ? నగదు లావాదేవీలు ఎలా జరిగాయి ? తదితర కోణాల్లో ప్రశ్నించింది. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్ స్టేట్మెంట్ ఆధారంగానే సినీ నటులకు నోటీసులు జారీ చేసింది. నిందితుల  స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసి.. వారి బ్యాంకు లావాదేవీలను పరిశీలించింది. విదేశాల నుంచి డార్క్‌వెబ్‌ ద్వారా డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఈడీ విచారణలో నిందితులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుని హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా ముగ్గురు నిందితులు వెల్లడించారు.

మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు డబ్బులు పంపినట్లు కెల్విన్ వివరించాడు. కెల్విన్, పీటర్ , కమింగా బ్యాంకు డీటెయిల్స్ తో పాటు ఆన్ లైన్ లావాదేవీల వివరాలను తెప్పించుకుంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని హీరో నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పాడు. ఎఫ్ క్లబ్బు మేనేజర్ కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేశారని విషయాన్ని క్లబ్బు మేనేజర్ ద్వారా ఈడీ తెలుసుకోనుంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌, హీరోయిన్స్ చార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హీరోలు రానా దగ్గుబాటి, రవితేజ తదితరులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement