వాజేడు (ప్రభ న్యూస్): తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గడ్‌లో ఎన్కౌంటర్ జరిగింది. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఛత్తీస్‌గఢ్ దళ కమాండర్ ఎన్కౌంటర్ కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ సహాయక ప్రాంతమైన కొరంజెడ్-బందెపరా అడవుల్లో ఎయిడెడ్ ఏరియా కమిటీ ఇన్చార్జి డీవీసీఎం నగేష్, సెక్రటరీ ఏసీఎం బుచ్చన్న, ఏసీఎం విశ్వనాథ్, మరో 15-20 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు, ఎస్టీఫ్, ప్రత్యేక బలగాలు కలిసి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరాయి. మంగళవారం ఉదయం బందేపరా అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
ఎన్కౌంటర్ స్థలం నుండి మావోయిస్టుల మృతదేహాలు, ఏ కే 47 ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం.చేసుకున్నారు. కోరంజెడ్-బందెపరా అటవీప్రాంతంలో మావోయిస్టులు క్యాంపు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీస్ బలగాలు గుర్తించ్చాయి. ఎన్కౌంటర్ లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ జరగడంతో తెలంగాణ ఏజెన్సీ మండలాలలోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏ క్షణమైనా మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడవచ్చునని పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో పోలీసులు ముమ్మర తనిఖీ చేపడుతున్నారు.