ఐటీ టవర్ ప్రారంభంతో సిద్దిపేటలో 1500 మందికి ఉపాధి వచ్చిందని, సిద్దిపేటకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… కలోనైనా సిద్దిపేటకు ఐటీ హబ్ వస్తుందని అనుకున్నామా..? రాష్ట్రమే రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా..? సిద్దిపేటకు సీఎం కేసీఆర్ బలమైన పునాది వేశారన్నారు. తెలంగాణకు ఆయువుపట్టు సిద్దిపేట గడ్డ. ఐటీ టవర్ ప్రారంభం రోజునే సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప పరిణామమన్నారు. ఐటీ హబ్‌కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తరిస్తామన్నారు. సిద్దిపేటలో టీ హబ్ ఏర్పాటు చేస్తామని, 2014లో రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కేవలం రూ. 56 వేల కోట్లు మాత్రమేనని, ఇవాళ రూ. 2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమ్మిళిత, సమీకృత, సమతుల్య అభివృద్ధి అని కేటీఆర్ పేర్కొన్నారు. 3 శాతం గ్రామీణ జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 30 శాతం అవార్డులు సాధిస్తున్నాయి. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని 7.7 శాతానికి పెంచాం. మిషన్ భగీరథకు పునాది పడిన గడ్డ సిద్దిపేట అని కేటీఆర్ తెలిపారు. సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రముఖ ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయన్నారు. మంగళవారం మెగా జాబ్‌మేళా నిర్వహించగా, పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారన్నారు. ఓఎస్ఐ డిజిటల్ (244 ఉద్యోగాలు ), ఫిక్సిటీ టెక్నాలజీస్ (100), అమిడాయ్ ఎడ్యుటెక్ (80), జోలాన్ టెక్ (25), విజన్ ఇన్ఫో టెక్ (25), థోరాన్ టెక్నాలజీస్ (25), బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్ (03), ర్యాంక్ ఐటీ సర్వీసెస్ (25), కామ్‌సీఎక్స్ ఐటీ (25), ఎంఎస్‌పీఆర్ (25) అమృత సిస్టమ్ (25) ఇన్నోసోల్ (25) ఉద్యోగాలు కల్పించాయి. తొలుత 718 మందిని కంపెనీలు ఎంపిక చేసుకొన్నాయి. ఐటీ టవర్ ప్రారంభించిన మరు నిమిషం నుంచే వీరంతా పనిచేసేలా వసతులు కల్పించారన్నారు.