Saturday, November 23, 2024

ప్ర‌ముఖ నృత్య‌కారిణి.. పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్ కనక్ రెలే క‌న్నుమూత‌

గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ నృత్య‌కారిణి.. పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్ కనక్ రెలే (85) కన్నుమూశారు. ఆమె ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనక్‌ రెలే దహన సంస్కారాలు జుహు శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.గుజరాత్‌లో జన్మించిన రెలే ఏడేళ్ల వయసులోనే గురువు పాంచాలి కరుణాకర పనికర్ వద్ద కథాకళి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. ముంబై యూనివర్సిటీ నుంచి నృత్యశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. కనక్‌ రెలే నృత్య కళాకారిణిగా దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు సుదీర్ఘ సేవలందించారు. ఆమె సేవలకుగానూ డాక్టర్ రెలే పద్మశ్రీ (1989), పద్మభూషణ్ (2013), సంగీత నాటక అకాడమీ అవార్డు (1994), కాళిదాస్ సమ్మాన్ (2006), ఎమ్‌ఎస్‌ సుబ్బులక్ష్మి అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది.

రెలె మృతి పట్ల ప్రముఖ నటి హేమ మాలిని, సుధా చంద్రన్‌తపాటు పలువురు సినీప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యాక్తం చేశారు. ‘పద్మభూషణ్ కనక్ రేలే జీ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. నలంద పరివారం, శాస్త్రీయ నృత్యానికి తీరని శోకం మిగిల్చారు. శాస్త్రీయ నృత్య ప్రపంచంలో ఓ శకం ముగిసిపోయింది. కనక్ జీ అందం, వ్యక్తిత్వం శాశ్వతం. ఓం శాంతి’ అంటూ నటి హేమ మాలిని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు షేర్‌ చేశారు. మరో లెజెండ్ మాకు కన్నీళ్లను మిగిల్చి వెళ్లిపోయారని భరతనాట్య నర్తకి, నటి సుధా చంద్రన్ పేర్కొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ కనక్‌ రెలే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాగా లెజెండరీ డ్యాన్సర్‌, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ శ్రీమతి కనక్ రెలే మోహినీ అట్టం, కథాకళి నర్తకి. నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకురాలు కూడా. రెలే భర్త యతీంద్ర రేలే. ఈ దంపతులకు ఈషా, అహానా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వీరిద్దరూ ఒడిస్సీ నృత్యకారులు. వీరు కాకుండా రాహుల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రాహుల్‌ భార్య ఉమ.. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement