హైదరాబాద్, ఆంధ్రప్రభ : మత్స్యకార సొసైటీలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పిస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో 4,753 సొసైటీలు ఉండగా, వాటిలో 3,47.901 మంది సభ్యులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా 1185 సంఘాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. మే 15వ తేదీ లోగా వందశాతం సభ్యత్వం నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా సభ్యత్వం నమోదు చేయాలని,18 సంవత్సరాలు నిండిన మత్స్యకార కులాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తించాలని ఆయన సూచించారు. సోమవారం తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారుల సంక్షేమ కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నీటి వనరులు బాగా పెరిగాయన్నారు. ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందన్నారు. పెరిగిన మత్స్య సంపద ఫలాలను ఈ వృత్తిపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ అందజేస్తామన్నారు.
అందులో భాగంగానే నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, నూతన సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. జీవో నెంబర్ 98లో పేర్కొన్న విధంగా 30 మత్స్యకార కులాలకు చెందిన వారు అర్హులవుతారని, అందుకు సంబంధిత తహసిల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ పరిగణలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా నివాసముంటున్న వారు అర్హులైన తెలిపారు. ప్రభుత్వ సర్వీసులలో కొనసాగుతున్న వారు సొసైటీలలో సభ్యత్వం పొందడానికి అనర్హులని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలలో మత్స్యకార సంఘాల ఏర్పాటుకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులని , మత్స్యకార వృత్తిపై నైపుణ్యం లేని వారికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ ఇతర ప్రజాప్రతినిధులను అహ్వానించి వారిని భాగస్వామ్యం చేయాలని అధికారులకు మంత్రి తలసాని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యశాఖకు కనీస ఆదరణ కూడా కరువైందన్నారు. తెలంగాణ ఏర్పాడిన ఎనిమిదేళ్ళలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నట్లు ఆయన వెల్లడించారు. మత్స్యరంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విదేశీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ఫిష్ ఇన్ అనే సంస్థ వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు.