ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న నవ్లాఖా ఇవ్వాల బాంబే కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన భాగస్వామి సీనియర్ సిటిజన్ అని, ఢిల్లీలో నివసిస్తున్నందున జైలులో ఉన్న తనను తరచుగా కలవడం ఆమెకు సాధ్యం కాదని నవ్‌లాఖా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. మహారాష్ట్ర ప్రభుత్వం ఫోన్ చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదని నవ్లఖా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నవ్‌లాఖాకు ఫోన్ కాల్ యాక్సెస్ నిరాకరించడం అనేది జీవించే తన ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని అడ్వొకేట్ చౌదరి బుధవారం వాదించారు. దీనిపై ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వొకేట్ సంగీతా షిండే.. ఇరు వాదనలు విన్న బాంబే హైకోర్టు ఆగస్టు 2న తదుపరి విచారణ జరపనుంది.
ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర చేశారన్న కేసు..
మావోయిస్టులతో సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ నవ్లాఖా ఇవ్వాల (బుధవారం ) బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలు నుంచి ఫోన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే దీనికి అనుమతించలేమని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఎల్గార్ పరిషత్ -మావోయిస్ట్ లింకుల కేసులో నవ్లాఖా నిందితుడిగా ఉన్నారని, వారిపై నిషేధాన్ని విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన తీర్మానాన్ని జస్టిస్ నితిన్ జామ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట్ర న్యాయవాది సంగీతా షిండే ఉంచారు.
రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంతకం చేసిన తీర్మానం ప్రకారం.. నవీ ముంబైలోని తలోజా జైలుతో సహా జైళ్లలో ఖైదీలకు ఫోన్ కాల్స్ చేయడానికి కాయిన్ బాక్స్ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక్కడ నవ్‌లాఖా, ఇతర నిందితులు అండర్ ట్రయల్స్‌లో ఉన్నారు. అయితే.. రిజల్యూషన్‌లో కాయిన్ బాక్స్ సదుపాయానికి యాక్సెస్ మంజూరు చేయకూడదని అండర్ ట్రయల్, నిందితులకు సంబంధించి 10 కేటగిరీలను పొందుపరిచారు. ఈ 10 కేటగిరీలలో మొదటిది ఉగ్రవాదం లేదా.. దేశ-రాజ్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్స్ గురించి ఉంది.
కాగా, ఎల్గార్ పరిషత్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం.. నవ్లాఖా, అతని సహ నిందితులు నిషేధిత ఉగ్రవాద సంస్థ లేదా నిషేధిత సంస్థలకు కీలకంగా వ్యవహరించే వారని పేర్కొన్నారు. నవ్లాఖా, అతని సహ నిందితులు కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నారని చార్జ్‌షీట్‌లో తెలిపారు.