ఒక్క సారి ఏనుగుల గుంపు తోటపై పడిందంటే…మొత్తం నేలమట్టం చేసేస్తాయి. ఏనుగులు చేసే బీభత్సం అంత దారుణంగా ఉంటుంది మరి. వందల ఎకరాల పంటను క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. తాజాగా తమిళనాడులోని ఓ గ్రామంలో కూడా ఏనుగుల మంద ప్రవేశించి బీభత్సం సృష్టించింది. అయితే తోటను మొత్తం ధ్వంసం చేసిన ఏనుగులు ఒక అరటి చెట్టును మాత్రం వదిలేశాయి.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళ పట్టణ శివార్లలో కృష్ణసామి అనే రైతుకు అరటి తోట ఉంది. ఇటీవల సమీప అడవుల్లోంచి దారితప్పి వచ్చిన ఓ ఏనుగుల మంద కృష్ణసామి అరటి తోటపై దాడి చేసింది. తోటలోని 300కు పైగా అరటిచెట్లను ఏనుగులు తొక్కేశాయి. కానీ ఒక్కచెట్టును మాత్రం వదిలేశాయి. ఏనుగుల బీభత్సం తర్వాత గ్రామస్తులతో కలిసి తోటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు కృష్ణసామి.. ఆ తోటలో ఒక్క అరటి చెట్టు మాత్రమే విరిగిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అరటితోటను ధ్వంసం చేసిన ఏనుగులు.. ఆ ఒక్క ఎందుకు వదిలేశాయని పరిశీలించారు ఆ గ్రామ ప్రజలు. ఆ చెట్టుపై ఒక పక్షి గూడు కనిపించింది. ఆ గూట్లో కొన్ని పక్షి పిల్లలు కూడా ఉన్నాయి. అంటే పక్షి పిల్లలను చూసే ఏనుగులు ఆ చెట్టును వదిలేశాయని గ్రామస్తులు గ్రహించారు. ఆ పక్షి పిల్లలను, ధ్వంసమైన తోటను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఏనుగులకు కూడా మనసు ఉంటుదని అవి పక్క వారి బాధలను అర్థం చేసుకుంటాయని అంటున్నారు నెటిజన్లు..