ఓ ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ చేస్తుండగా పేలిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలుకలోని నిందిగొండి గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ బైక్ మంటలు చెలరేగి కాలిబూడిదైంది. గ్రామానికి చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని కొబ్బరితోటలో రాత్రి ఛార్జింగ్ పెట్టారు. ఓ గంట తర్వాత బైక్‌లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు మల్లికార్జున్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జ్వాలల్లో పూర్తిగా దగ్ధమైంది. ఆ పక్కనే ఉన్న ఓ మంచం కూడా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఎలక్ట్రిక్ బైక్ లలో ఇలా ఛార్జింగ్ చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగటం వినియోగదారులను ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఓ ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ పెడుతుండగా.. మంటలు చెలరేగి దగ్ధమైంది. ఆ ఘటన మరువక ముందే తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital