Friday, November 22, 2024

రోజుకు 10 వేల కేసులు వస్తున్నా.. తెలంగాణలో రాజకీయ ర్యాలీలు ఆగడం లేదు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ మున్సిపల్ ఎన్నికల వేడి నడుస్తోంది. మంగళవారం 10వేలకు పైగా కరోనా కేసులు నమోదైనా రాజకీయ పార్టీలకు ఇదేమీ పట్టడం లేదు. మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలుమార్లు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని మొండిపట్టు ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఏం చేయాలో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు కరోనాను లెక్కచేయకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని విమర్శలు వస్తున్నా… తెలంగాణ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. అటు ఇప్పటికే నాగార్జునసాగర్ ఎన్నికల కారణంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు కీలక నేతలు కరోనా బారిన పడినా కూడా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు అయితే పోటాపోటీగా రాజకీయ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రజలు డబ్బులకు ఆశపడి ర్యాలీలు, సమావేశాలకు హాజరవుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా కరోనా పాజిటివ్‌తో అల్లాడుతున్నారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల కమిషన్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణలో లక్షల మంది ప్రజలు కరోనాతో బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా ఇటీవల తమిళనాడులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల కారణంగానే కరోనా కేసులు బీభత్సంగా పెరిగాయని, ఎన్నికల అధికారులపై ఎందుకు మర్డర్ కేసు పెట్టకూడదని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement