న్యూ ఢిల్లీ – వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలు రంగంలోకి దిగగా.. తాజాగా కాంగ్రెస్ ఆన్లైన్ యుద్ధాన్ని ప్రారంభించింది.
రాహుల్ గాంధీతో రూపొందించిన యానిమేటెడ్ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. భాజపా విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తూ విద్వేష వ్యాపార వీధిని సృష్టించిందని, రాహుల్ గాంధీ అక్కడ ప్రేమ దుకాణాలను తెరిచి దానిని అడ్డుకుంటున్నారని అందులో ఉంది.
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఐక్యతకు చిహ్నంగా నిలిచారని వీడియోలో ఉంది. 1.43 నిమిషాల ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అందులో.. ప్రజాస్వామ్యం, మీడియా, బ్యూరోక్రసీలను బంధించి రథంపై వేసుకుని వెళ్తున్నట్లుగా ప్రధాని మోడి యానిమేటెడ్ పాత్ర ఉంది. హిందూ, ముస్లింల మధ్య చీలికకు ప్రయత్నిస్తున్నట్లుగా అమిత్ షా పాత్రను కాంగ్రెస్ చూపించింది. అదే సమయంలో రాహుల్ గాంధీ వచ్చి రెండు వర్గాల మధ్య ఐక్యతకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.