Tuesday, November 26, 2024

5రాష్ట్రాలకి ఎన్నిక‌..4రాష్ట్రాల్లో బిజెపి విజ‌య కేత‌నం..ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్ఎస్ స‌ర్వే ఫ‌లితాలు..

వ‌చ్చే ఏడాది ఐదు రాష్ట్రాల‌కి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల గెలుపుతో మంచి ఉత్సాహంమీదుంది బిజెపి. ఈ మేర‌కు నేత‌లంతా త‌మ స‌త్తాని చాటేందుకు పార్టీ కార్య‌క‌లాపాల‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. మ‌రి ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లో గెలిచేందుకు ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ప‌న్నుతున్నారు. కాగా వారి లెక్క‌లు వారికి ఉంటే..స‌ర్వే లెక్క‌లు కూడా వారికే ఫేవ‌ర్ గా ఉండ‌టం విశేషం..వివరాల్లోకి వెళ్తే..ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్ఎస్ నిర్వహించిన తాజా సర్వేలో బిజెపి విజ‌యం సాధిస్తుంద‌నే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ బిజెపి జయకేతనం ఎగురవేస్తుందని తెలిపింది.

ఈ నెల మొదటి వారంలో 1,07,193 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వస్తుందని సర్వే పేర్కొంది. 403 స్థానాలున్న యూపీలో బీజేపీ 40.7 శాతం ఓట్లతో 217 సీట్లు సాధిస్తుందని చెప్పింది. అయితే, ఈసారి 108 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీకి కోల్పోతుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎస్పీ, బీజేపీ మధ్యే ఉంటుందని, ఎస్పీ 31.1 శాతం ఓట్లతో 156 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి స్థానాలు తగ్గుతాయని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ మార్కును దాటుతుందని వివ‌రించింది.

గత ఎన్నికల్లో 57 సీట్లు సాధించగా, ఈసారి వాటి సంఖ్య 38కి పడిపోతుందని, కాంగ్రెస్‌కు అదనంగా 21 సీట్లు వస్తాయని, దీంతో దాని బలం 32 స్థానాలకు పెరుగుతుందని వివరించింది. 40 సీట్లు ఉన్న గోవాలో బీజేపీకి 21, ఆప్‌కు 5, కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కుతాయని, ఇతరులు 10 స్థానాలు దక్కించుకుంటారని పేర్కొంది. మణిపూర్‌లోని 60 స్థానాల్లో 27 బీజేపీ ఖాతాలో పడతాయని, కాంగ్రెస్‌కు 22 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక పంజాబ్‌లో మాత్రం కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే అంచనా వేసింది. 117 సీట్లున్న పంజాబ్‌లో ‘ఆప్’ 51 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్ 31 స్థానాలను కోల్పోయి 46 సీట్లకు పరిమితం అవుతుందని, అకాలీదళ్ 20 సీట్లతో మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. మ‌రి స‌ర్వే అంచ‌నాలు నిజ‌మ‌యి స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయా బిజేపికి తిరుగు లేన‌ట్లే..ఏమ‌వుతుందో చూడాలి మ‌రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement