Friday, November 22, 2024

Election Plans – భారాస యుద్ధం – గెలిచేందుకు బ‌హుముఖ వ్యూహం..

అసెంబ్లి ఎన్నికల్లో 100 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటేందుకు వ్యూహం రచిస్తున్న భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత, ముఖ్య మంత్రి చంద్రశేఖర్‌రావు బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఆషాఢమాసం ముగిసిన వెంటనే 80 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించేం దుకు సిద్ధమైన కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం లోనూ దూకుడు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల్లో పోటీకి దిగనున్న నాయకులు నోటిఫికేషన్‌ వెలువడే లోపు ఒక్కో ఇంటిని కనీసం 10సార్లు అయినా తాకి ఆ ఇంట్లోని వారందరినీ కలిసే విధంగా వ్యూహం రచించే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లిd ఎన్నికల్లో పక్కాగా 100 సీట్లు సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సర్వే సంస్థల ద్వారా పూర్తి సమాచారాన్ని తెప్పించిన సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

ఆయా నియోజకవర్గాలు, పార్టీ ముఖ్యనేతలతో వరుస సమావేశాలను నిర్వహిస్తున్న కేసీఆర్‌ వారి నుంచి కూడా సమాచారం సేకరిస్తు న్నారు. సర్వేలలో ప్రతికూల ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలకు మరోసారి బృందాలను పంపించి సమాచారం తెప్పిస్తున్నారు. మూడు ప్రముఖ సర్వే సంస్థలను క్షేత్రస్థాయికి పంపించి ప్రతి వారం వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటూ నివేదికలను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చిన సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. త్వరితగతిన అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అసంతృప్తులకు చెక్‌ పెట్టవచ్చన్న భావనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లిd నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని ఎంపిక చేసి ప్రతీ రోజూ ఆ నియోజకవర్గంలో పరిస్థితిని నేరుగా తనకు తెలియజేసేలా కార్యచరణ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాను నియోజకవర్గ ఇన్‌చార్జి ద్వారా ఆయా బూత్‌ కమిటీలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి లబ్ధిదారుడిని నేరుగా కలవడంతోపాటు ప్రభుత్వం ద్వారా వారు పొందిన లబ్ధిని వివరించి చెప్పాలని నిర్ణయించారు.

భారాస మళ్లి అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు మరిన్ని కొత్తవాటిని అమలు చేస్తామన్న భరోసాను వారికి ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా వారి వారి నియోజకవర్గాలకు వెళ్లి ఓటర్లను నేరుగా కలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, హైదరాబాద్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తే చర్యలు తప్పవన్న హెచ్చరికలను ఇప్పటికే జారీ చేసినట్లు సమాచారం. సర్వేల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారితోనూ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వలేనని నేరుగా వారికి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రికి ఇప్పటికే ఈ తరహా సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు అవకాశం ఇస్తానని ఆ మంత్రికి హామీ ఇచ్చారని సమాచారం. నిండు శాసనసభలో ప్రకటించిన విధంగానే ఈ ఎన్నికల్లో భారాసకు 100సీట్లు ఖాయమన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటిస్తున్నట్లు సమాచారం.

తొమ్మిదేళ్లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల మనసులను గెలుచుకున్నామని, దేశంలో ఏ రాష్ట్రం చేయని పథకాలను అమలు చేసి చూపించామని ఇదే విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని ఆయన పార్టీ నేతలను, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోరుతున్నట్లు సమాచారం.

నేనున్నా… ఆందోళన వద్దు… అన్నీ గెలుస్తున్నాం…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని సీట్లు భారాసవేనని ఇందులో ఎటువంటి అనుమానం లేదని సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఇటీవల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి జిల్లాలో ఎన్నికల ప్రచారంపై చర్చించారు. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచార బాధ్యతను తానే పర్యవేక్షిస్తానని, గతంలో ఖమ్మం మినహా మిగతా నియోజకవర్గాల్లో భారాసే గెలవలేదని పేర్కొంటూ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కసీటును ప్రత్యర్థి పార్టీలు గెలుస్తుండగా తొమ్మిదింట్లో భారాస పాగా వేస్తోందని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. సర్వేలో ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న నియోజక వర్గాల్లోనూ పార్టీ మరింత బలపడిందని, అన్ని నియోజక వర్గాల్లోనూ మనమే గెలుస్తున్నామంటూ కేసీఆర్‌ పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ వీడడం ద్వారా ప్రయోజనమే కలిగిందని, ఆయన వల్ల ఒరిగిందేమీ లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది

- Advertisement -

జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లో ఉంటూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. పోడు భూముల పట్టాల సమస్యలను తీర్చడంతోపాటు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గిరిజన తండాలను, ఆదివాసీల గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసి వారికి నిధులు కేటాయించిన ఘనత భారాస ప్రభుత్వానిదన్న విషయాన్ని ఆయా గ్రామ పంచాయతీలకు వెళ్లి చెప్పాలని ఇందులో సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలని కేసీఆర్‌ కోరినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ప్రజల్లోనే ఉండాలని, వారితో అనునిత్యం మమేకమై సమస్యలను, ఇబ్బందులను తీర్చాలని కోరారు.

ఉమ్మడి పాలమూరులో ఇద్దరు సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతే…
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరు సిట్టింగ్‌లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో ఒక నియోజకవర్గం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉండగా మరో నియోజకవర్గం నాగర్‌కర్నూలు జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఈ రెండు నియోజకవర్గాల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చాలన్న ప్రతిపాదనకు వచ్చినట్లు చెబుతున్నారు. కాగా ఈ రెండు నియోజకవర్గాల్లో రీసర్వే నిర్వహించి ఫలితాలు వచ్చాక అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డిని పోటీకి పెడితే ఎలా ఉంటుందన్న అంశంపై సమాచారం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్‌రెడ్డి ఆ తర్వాత భారాస తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సబితతోపాటు కాంగ్రెస్‌ను వీడి భారాసలో చేరిన ప్రతాప్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు.

ఇటీవల సదరు మాజీ ఎమ్మెల్యేను భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు పిలిపించి అసెంబ్లి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 7న తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు కేటీ రామారావు ఫోన్‌ చేసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని, సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయని ఆయనకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో షాద్‌నగర్‌ అసెంబ్లి టికెట్‌ ప్రతాప్‌రెడ్డికే వస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement