Tuesday, November 26, 2024

14న మండలి చైర్మన్‌ ఎన్నిక, నోటిఫికేషన్‌ జారీ చేసిన కార్యదర్శి.. మళ్లీ గుత్తాకే చాన్స్​?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శాసనమండలి చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 14న మండలి చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.30గంటలనుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా, సోమవారం ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుతం మండలి ప్రోటెం స్పీకర్‌గా సయ్యద్‌ అమీన్‌ ఉల్‌ హసన్‌ జాఫ్రీ కొనసాగుతున్నారు. ఈ మేరకు శనివారం శాసన మండలి కార్యదర్శి డాక్టర్‌ వి నర్సింహ్మాచార్యులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మండలిలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. మండలి చైర్మన్‌గా గతేడాది జూన్‌ 4న గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. దీంతో ప్రోటెం స్పీకర్‌గా భూపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన గత జనవరి 4న పదవీ విరమణ చేశారు. దీంతో ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నియమించారు.

కాగా శాసనమండలి బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మండలికి చైర్మన్‌, డిప్యుటీ చైర్మన్‌లకు ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఆమోదంతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ దఫాకూడా మండలి చైర్మన్‌ పదవిని మళ్లీ గుత్తా సుఖేందర్‌రెడ్డికే కేటాయించే అవకాశం ఉంది. డిప్యుటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్‌కు అవకాశం కల్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. 40మంది సభ్యులున్న శాసనమండలిలో టీఆర్‌ఎస్‌కు 36మంది సభ్యులు ఉన్నారు. దీంతో రెండు పదవులు ఏకగ్రీవం కానున్నాయి. మరోవైపు మండలిలో చీఫ్‌ విప్‌తోపాటు మరో నలుగురు విప్‌లు ఉండగా, ఎంఎస్‌ ప్రభాకర్‌రావు మినహా గతంలో చీఫ్‌ విప్‌ పదవుల్లో ఉన్నవారంతా ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.

గతేడాది మార్చినుంచి డిసెంబర్‌ వరకు మండలి వివిధ కోటాల్లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా 21మంది ఎన్నికయ్యారు. గతంలో విప్‌లుగా వ్యవహరించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావులు స్థానిక సంస్థల కోటాలో తిరిగి ఎన్నికయ్యారు. కాగా, తాజాగా చైర్మన్‌ ఎన్నికకు ముగ్గురు సీనియర్ల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం గుత్తా అభ్యర్ధిత్వంవైపు మొగ్గుచూపుతున్నట్లుగా తెలిసింది. మధుసూదనాచారి, కడియం శ్రీహరిలు కూడా చైర్మన్‌ పదవిని ఆశించారు. మరోవైపు భానుప్రసాద్‌, వాణీదేవి, రవీందర్‌రావు, వీజీ గౌడ్‌ల పేర్లను ప్రభుత్వ విప్‌లుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement