Monday, November 18, 2024

పంజాబ్‌లో ఎన్నికల వేడి.. సీఎం బంధువుల ఇంట్లో ఈడీ సోదాలు.. చన్నీ మేనల్లుడే లక్ష్యంగా దాడులు

చండీగడ్‌ : పంజాబ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ బంధువుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ అధికారులు తెలిపారు. చన్నీ బంధువు భూపిందర్‌ సింగ్‌ హనీ నివాసంతో పాటు పఠాన్‌కోట్‌, లూధియానా, మోహాలీలోని 10 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఏక కాలంలో ఈ దాడులు ప్రారంభం అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మైనింగ్‌ చేస్తూ.. కోట్లాది రూపాయలు పోగేసుకున్నట్టు వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో 2018లో పంజాబ్‌ పోలీసులు.. కుద్రత్‌ దీప్‌ సింగ్‌ అనే కీలక రియల్టర్‌పై కేసు నమోదు చేశారు. ఇతనికి షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలోని నవాన్‌షహర్‌లో ఇసుక క్వారీలు ఉన్నాయి.

కుద్రత్‌ దీప్‌ సింగ్‌ రెండు కంపెనీలను స్థాపించాడు. ఆ కంపెనీ డైరెక్టర్స్‌లో పంజాబ్‌ సీఎం చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ మరదలి కుమారుడు భూపిందర్‌ సింగ్‌ హనీ ఒకడు. దీంతో ఇతని ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. కంపెనీ డైరెక్టర్లు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో భూపిందర్‌ ఓ సంస్థ నిర్వహిస్తున్నాడు. ఈ సంస్ధ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీలాండరింగ్‌ కేసు నమోదుకావడంతో.. దర్యాప్తులో భాగంగా.. ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. ఈసీ ఎన్నికల తేదీల్లో మార్పు.. ఈడీ అధికారులతో దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో ఇసుక మైనింగ్‌ అంశం కీలకంగా మారింది. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ కూడా గతంలో సంచలన ఆరోపణలు చేశారు. తాము పంజాబీలమని.. ఇలాంటి దాడులకు భయపడబోమని సీఎం చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు పంజాబీలు లొంగరనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప.బెంగాల్‌ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ప్రభుతం ఇలాగే దాడులు చేయించిందని, చివరికి ఏమైందో అందరికీ తెలిసిందని గుర్తు చేశారు. ఎన్ని దాడులు చేసినా.. ఇబ్బందులు పెట్టినా.. పంజాబ్లో గెలిచేది కాంగ్రెస్‌ ప్రభుతమే అని తేల్చి చెప్పారు. బెంగాల్‌లో దీదీ బంధువులను లక్ష్యంగా చేసుకుంటే.. ఇక్కడ తన బంధువులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలోనే.. ఈడీ దాడులు గుర్తుకొస్తాయని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement