మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా అధికార బీజేపీ యువకులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా 91 ఏళ్ల వృద్ధనేతపై నమ్మకం ఉంచింది. ఆయన పేరు షమనూర్ శివశంకరప్ప. దక్షిణ దావణగెరె నియోజకవర్గం టికెట్ ను కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శివశంకరప్పకు కేటాయించింది. శివశంకరప్ప కర్ణాటక రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకు ఐదుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించగా, ఓసారి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న వారిలో శివశంకరప్ప అత్యంత పెద్ద వయస్కుడు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై శివశంకరప్ప స్పందించారు. తనను తాను గెలుపు గుర్రంగా అభివర్ణించుకున్నారు. తనకు ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఈ ఎన్నికల్లో తాను అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని శివశంకరప్ప ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ, సన్నిహిత వర్గాల్లో ఆయనను ఎస్ఎస్ (శివశంకరప్ప) అని పిలుస్తారు. ఆయన ఎన్నికల అఫిడవిడ్లో తన ఆస్తుల విలువను రూ.312.75 కోట్లుగా పేర్కొన్నారు. అనేక మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కాలేజీలు స్థాపించి విద్యారంగంలో అగ్రగామిగా ఉన్నారు. శివశంకరప్ప కుమారుడు మల్లికార్జునకకు కాంగ్రెస్ పార్టీ దావణగెరె నార్త్ నియోజకవర్గం టికెట్ కేటాయించింది.