హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడు తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. త్రిముఖ పోటీ అత్యంత బలంగా కనిపిస్తుండడంతో ఆయా పార్టీల అధినాయకులు ప్రధానంగా ఎన్నికల ప్రణాళికలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఈసారీ హ్యాట్రిక్ విజయం ఖాయమనీ, అందుకు తమవద్ద అనేక అస్త్రాలు ఉన్నాయనీ తాజాగా అసెంబ్లి లో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో విపక్షాల్లో ఆందోళన రెట్టింపయ్యింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యమని చెప్పుకుంటూ మొన్నటి వరకూ మాటల తూటాలు పేల్చిన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. కేసీఆర్ గెలుసు ధీమా వెనక రాజకీయమేంటో.. ఆయన విజయ రహస్య మేంటో.. తెలియక అయోమయం చెందుతూనే, తమదైన శైలిలో మేనిఫెస్టోలను రూపొందించి ప్రజల్లోకి వెళ్ళడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒకరికి మించి మరొకరు పోటీపడుతూ కసరత్తు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా, ఆకర్షణ ఆయుధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బీఆర్‌ఎస్ సంక్షేమ అస్త్రాన్ని అధిమించేందుకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ మేథోమదనంలో నిమగ్న మయ్యాయి. రాజకీయ భీష్ముడిగా పేరుతెచ్చు కున్న ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ఎత్తుగడలను అధిగమించే ప్రయత్నం కాస్త గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయా పార్టీలకు చెందిన నేతలే సెలవిస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనతో అగ్రనేతలు బిజీబిజీ అయి పోయారని సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్టోబర్ లేదా నవంబర్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యాయి.
గతానికి పూర్తి భిన్నంగా ఈసారి అన్ని పార్టీలూ అసెంబ్లి ఎన్నికలను సవాలుగా స్వీకరిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా అగ్రనేతలు పనిచేస్తుంటే, ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు, రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం మరింత పట్టుదలతో పనిచేస్తోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గట్టి ధీమాతో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. అదే సమయంలో కేసీఆర్ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ క్షేత్రస్థాయి నుంచి మరింత గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ రెండింటికీ భిన్నంగా కేంద్ర ప్రభుత్వ, పార్టీ అధిష్టాన పెద్దల అండదండలతో ఇటు బీఆర్‌ఎస్‌ను, అటు కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేందుకు భారతీయ జనతా పార్టీ తమదైన శైలిలో ముందుకు సాగుతోంది.
ప్రజాభిమానం ఎక్కడుంటుందో.. కురుక్షేత్రంలో ఎవరు పైచేయి సాధిస్తోరో.. ఇప్పటికిప్పుడు తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేయలేని స్థాయిలో రాజకీయ నాడి అందకుండా పోతోంది. పార్టీ ఏదైనా.. విజయానికి తొలిమెట్టు ఎన్నికల ప్రణాళికే కావడంతో, అన్ని పార్టీలూ ఆ దిశగానే కసరత్తు వేగవంతం చేశాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా అగ్రనేతలంతా బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్నారు. సామాన్య కార్యకర్తలకే కాదు.. నియోజకవర్గ స్థాయి నాయకులకూ అందుబాటులోకి రావడం లేదు. జాతీయ నాయకత్వం మార్గనిర్ద శం మేరకు పనిచేయాల్సి ఉన్న కాంగ్రెస్, బీజేపీల్లో రాష్ట్రస్థాయి నాయకులంతా క్రమం తప్పకుండా ప్రతివారంలో నాలుగైదు సార్లు ఢిల్లి చుట్టు ప్రదక్షిణలు కొడుతున్నారు. వ్యూహమంతా అక్కడే ఖరారవుతుండడంతో లోటుపాట్లు లేకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే, ప్రధానంగా ఈ మూడు రాజకీయ పార్టీల్లో ఒకే తరహా విధానం కనిపిస్తోంది. గెలుపోటములను పక్కబెట్టి అధికారం కోసం నేతలు, సీట్ల కోసం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు.
దమ్ముంటే సిట్టింగ్‌లకే సీట్లివ్వాలన్న సవాల్ ఇటీ-వలి కాలంలో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఇతర పార్టీల నుంచి ఎక్కువగా వస్తోంది. ప్రధానంగా దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. తమ సవాల్‌ను స్వీకరించి సిట్టింగ్‌లను కొనసాగిస్తే వారిపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చేస్తే.. వారు రెబల్స్‌గా మారి అంతర్గతంగా బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించే ప్రమాదం పొంచి ఉంది. రెచ్చగొట్టే రాజకీయ సవాళ్ళ వెనక విపక్ష పార్టీల వ్యూహం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకతను డీల్ చేసే కసరత్తులో సీఎం కేసీఆర్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన సవాల్ అసంతృప్తి. ఎంత ఎక్కువ కాలం అధికారంలో ఉంటే ప్రజల్లో అంత ఎక్కువ అసంతృప్తి కనిపిస్తుంది. ఇప్పుడున్న రాజకీయాల్లో ఓ ప్రభుత్వం మూడోసారి గెలవడం అంటే.. చిన్న విషయం కాదు. అసంతృప్తి బయటకు కనిపించాలనేం ఉండదు. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి అనేది కనిపిస్తే ఎన్నికల నాటికి అది తగ్గే అవకాశం లేదు.
ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా.. అమలు చేయడం ప్రారంభించినా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టం. పైగా తమను మరోసారి ఇలాంటి పథకాల పేరుతో మాయ చేయాలనుకుంటు-న్నారని మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అది ఓట్ల రూపంలో కనిపిస్తుంది. అదే సమయంలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటే మాత్రం.. ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు దూరమైన ఎమ్మెల్యేల్ని దూరం పెట్టి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా వీలైనంత వరకూ అసంతృప్తిని తగ్గించి.. ఓట్ల కోతను అడ్డుకునే అవకాశం ఉంటు-ంది. కానీ ప్రభుత్వంపై అసంతృప్తిని తగ్గించడం ఎంత కష్టమో… ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన ఎమ్మెల్యేల్ని మార్చడం అంతే కష్టం. ఎందుకంటే వారు రెబల్‌గా మారే చాన్స్ ఉంది. వారంతా అప్పటికే ఆర్థికంగా బలోపేతం అయి ఉంటారు. పార్టీ క్యాడర్ చాలా వరకూ వారి వెంటే ఉంటు-ంది. అందుకే సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చడం కూడా రెండు వైపులా పదునున్న వ్యూహం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
సిట్టింగ్‌లపై బీఆర్‌ఎస్ ఆచి, తూడి అడుగులు
సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చాలా వద్దా అన్న డైలమాలో కేసీఆర్ ఉన్నారని ఇటీ-వలి కాలంలో బీఆర్‌ఎస్ ముఖ్యనేతల ప్రకటలను బట్టి అర్థమవుతుంది. బీఆర్‌ఎస్‌కు ప్రశాంత్ కిషోర్ టీ-మ్ పని చేసినప్పుడు సర్వేల ద్వారానే టిక్కెట్లు- వస్తాయని కనీసం యాభై మందికి మొండిచేయి అని చెప్పారు. తర్వాత కొంత మందికి తప్ప అందరికీ టిక్కెట్లు- ఖాయమని చెబుతున్నారు. కానీ కేసీఆర్ భారీగా టిక్కెట్లు- నిరాకరించబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరందరికి టిక్కెట్లు- నిరాకరించడం వల్ల వచ్చే తిరుగుబాటు-ను తగ్గించడానికే కేసీఆర్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. 2018లో ముందస్తుకు వెళ్లాలనుకున్నప్పుడు కేసీఆర్ కేవలం ముగ్గురంటే ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు- నిరాకరించారు. వారు బాబూమోహన్, బొడిగే శోభ, నల్లాల వోదేలు. ఈ ముగ్గురూ తిరుగుబాటు- చేశారు. ఇద్దరు బీజేపీలో చేరారు. ఒకరు సర్దుకున్నప్పటికీ.. తర్వాత రకరకాల పార్టీలు మారారు. అంటే టిక్కెట్లు- నిరాకరించిన ముగ్గురూ వ్యతిరేకమయ్యారు. నిజానికి వీరు నియోజకవర్గాల్లో బలమైన నేతలు కాదు.. పార్టీ బలమే వీరి బలం. అదే నియోజకవర్గాల్లో పలుకుబడి ఉన్న నేతలకు టిక్కెట్లు- నిరాకరిస్తే.. తిరుగుబాటు- చేయకుండా ఉంటారా.. అన్న సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
భాజపా మిషన్ 75.. వ్యూహమంతా ఢిల్లీలోనే..
తెలంగాణలో ఎలాగైనా ఈసారి పాగా వేయాలనుకుంటు-న్న బీజేపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా రోజుకో సరికొత్త నిర్ణయం తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ.. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయాత్తవుతున్న కాషాయ పార్టీ.. తెలంగాణ నాయకత్వ మార్పు నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మిషన్ 75 పేరుతో ఆపరేషన్ స్టార్ట్ చేసిన బీజేపీ ఒక్కొక్క నాయకుడు ఏ ఏ పని చేయాలి? ఎలా ప్రజల్లోకి వెళ్లాలి..? పార్టీ విస్తరణ.. బలమైన నాయకత్వం.. ఎన్నికల్లో పోటీ-.. ఇలా అన్ని అంశాలపై బ్లూ ప్రింట్లు- ఇస్తూ మరి అధిష్టానం రోజూ మానిటరింగ్ చేస్తోంది. అయితే, ఈ తతంగమంతా మొత్తం కూడా ఢిల్లీలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీలో ఒక వార్ రూమ్‌ను కూడా ఏర్పాటు- చేశారు అగ్రనేతలు. ఇక నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన మీటింగ్ అయినా.. ఇక నుంచి ఢిల్లీనే వేదిక అని తెలుస్తోంది. అంతేకాదు ఇంటర్నల్ ఇష్యూ ఏమున్నా.. పార్టీ మీటింగ్‌లో మాట్లాడాలని.. పార్టీ నిర్ణయం దాటి ఎవరు అనవసరపు కామెంట్స్ చేయొద్దని ఇటీవల అధిష్టానం ఖరాకండిగా, చాలా సీరియస్‌గా చెప్పినట్టు- తెలుస్తుంది.
ఎన్నికల వేళ రాష్ట్రలో ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలన్నా.. ఇట్టే ప్రభుత్వానికి తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే ఢిల్లీలో ఆపరేషన్ జరపాలనే నిర్ణయం జరిగినట్టు-గా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీలో జాయినింగ్‌కి సంబంధించిన అంశం కూడా చాలా సీక్రెట్‌గా మెయిం-టైన్ చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఎవరితో చర్చలు జరుపుతున్నారు..? ఎవరు పార్టీలో జాయిన్ అవుతున్నారు..? అనే అంశాన్ని ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో పార్టీలో జాయిన్ అయ్యే వరకు కూడా వారి పేర్లను ఎక్కడా కూడా తెరపై బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి అన్న అంశంపైనే లీకులు ఇస్తున్నారని, చేరడం మాత్రం పక్కా అంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటు-న్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్
ఆరునూరైనా ఈసారి జరిగే ఎన్నికల్లో అధికారం ఖాయం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ కాస్త గట్టిగానే కసరత్తు చేస్తోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ గెలిచే సీట్లు- ఎన్ని.. ఏం చేయాలి.. అసలు అధికారంలోకి వస్తుందా అనే అంశాలపై ఇటీవల పార్టీ నాయకత్వానికి కీలక సర్వే అందింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపైన రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఢిల్లిdలోని పార్టీ హైకమాండ్‌కు కీలక నివేదిక సమర్పించారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితులపైన అంచనాలను వివరించారు. ఈ నివేదిక ఆధారంగా తాజాగా హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమైన ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ కీలక సూచనలు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష చేశారు. సునీల్ కనుగోలు ఇచ్చి నివేదిక ఆధారంగా మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించారు. వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చేయాల్సిన మార్పులు.. అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని సునీల్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు- తెలుస్తోంది. మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటు-ందని సూచించారు. 36 స్థానాల్లో మాత్రం గెలుపు అంత సులభం కాదని తేల్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని సునీల్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు- పార్టీ నేతల సమాచారం. గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లేలా ఎన్నికల ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. పరిస్థితి బాగోలేదని చెప్పిన 36 నియోజకవర్గాల్లో ఏం చేయాలి.. ఎటు-వంటి వ్యూహాలు అమలు చేయాలనే దాని పైన నివేదికలు కోరినట్లు- తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ను ధీటు-గా ఢీ కొట్టేలా ఆకర్షణీయ మేనిఫెస్టోతో అన్నివర్గాలను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని కోసం పలు రకాలుగా అభ్యర్ధుల ఎంపిక మొదలు.. అన్ని స్థాయిలోనూ కమిటీ-లు ఏర్పాటు- చేస్తోంది.