Tuesday, November 19, 2024

టీఆర్ఎస్ సర్కార్ కు షాక్.. హుజురాబాద్ లో దళిత బంధుకు బ్రేక్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది. దళిత బంధును నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ పథకాన్ని హుజురాబాద్ నుండే పైలేట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించింది. పథకానికి ఇప్పటికే కోట్ల రూపాయాలు విడుదల చేసింది. దాంతో దీని పై చాలా ఫిర్యాదులు వచ్చాయి. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలు లేఖలు అందాయి. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకూ ఈ దళిత బందును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నిక తర్వాత దళిత బంధు పథకం యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

కాగా, దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి కల్పన కోసం..30 రకాల పథకాలను, కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో పొందుపరిచింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద హైడ్రామా

Advertisement

తాజా వార్తలు

Advertisement