ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీఎస్ రమాదేవి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ పదవిలో ఉన్నది స్వల్పకాలమే అయినప్పటికీ ఇప్పటివరకు ఆ రాజ్యాంగ పదవి చేపట్టిన ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. వీఎస్ రమాదేవి ఏపీలోని ప్రస్తుత ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందినవారు. ఏలూరు, హైదరాబాద్‌లో చదువుకున్న ఆమె సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర న్యాయశాఖలో స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేసిన రమాదేవి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గానూ పనిచేశారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా..
వీఎస్ రమాదేవి భారతదేశ తొమ్మిదో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. 1990 నవంబరు 26న బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది డిసెంబర్ 11 వరకు ఆ పదవిలో ఉన్నారు. కాగా, ఏపీ, తెలంగాణ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన ఇద్దరిలో ఆమె ఒకరు. రమాదేవి కంటే ముందు ఆర్వీఎస్ పేరి శాస్త్రి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. కాగా, రమాదేవి 16 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నప్పటికీ భారతదేశ ఎన్నికల విధానం, వ్యవస్థకు సంబంధించి ప్రజలకు సమగ్ర సమాచారం అందాలన్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్లకు న్యాయ సలహాదారుగా పనిచేసిన ఎస్‌కే మేందీరత్తాతో కలిసి ఓ పుస్తకం ప్రచురించారు.‘హౌ ఇండియా వోట్స్ – ఎలక్షన్ లాస్, ప్రాక్టీస్, ప్రొసీజర్స్’ పేరిట ప్రచురించిన ఈ పుస్తకంలో రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంటు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయనేది క్షుణ్ణంగా వివరించారు.
ఆ రెండు పదవుల్లోనూ తొలి మహిళ ఆమెనే..
వీఎస్ రమాదేవి 1993, 1997 మధ్య రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గానూ పనిచేశారు. ఈ పదవి చేపట్టినవారిలో తొలి మహిళగానూ రమాదేవికి గుర్తింపు లభించింది. ఉద్యోగ విరమణ తర్వాత రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం కర్నాటక గవర్నరుగానూ పనిచేశారు. కర్నాటకకు గవర్నర్లుగా పనిచేసినవారిలో తొలి మహిళ ఆమె.
భాష సరళం, శైలి దృఢం
రమాదేవి రచయిత్రిగానూ తెలుగునాట చాలామందికి పరిచయమే. తెలుగు పత్రికల్లో ఆమె కథలు, ధారావాహికలు రాశారు. తెలుగులో విపులాచపృథ్వీ, అనంతం, దేవుడికి ఉత్తరం, లేడీస్ కంపార్ట్‌మెంట్, తల్లీబిడ్డలు, మజిలీ వంటి పుస్తకాలు రాశారు. రమాదేవి రచనలు సరళమైన భాష, దృఢమైన శైలిలో ఉంటాయని, వందలాది వచన రచనలతో ఆమె సాహితీ రంగంలో తానేమిటో నిరూపించుకున్నారని తెలుస్తోంది. మహిళల సంక్షేమ చట్టాలకు సంబంధించి ఆమె కలం, గళం ఎన్నడూ రాజీ పడలేదని, మజిలీ వంటి తన రచనలలో సామాన్యుల జీవనాన్ని చిత్రించినట్టు అవగతం అవుతోంది. పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యాసాలు, రూపకాలు, కథలు రాసిన విలక్షణ ప్రయోగశీలిగా నిలిచారు.
ఇప్పటి వరకు చీఫ్ ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు నిర్వహించిన వారి జాబితా
1) సుకుమారన్ సేన్
2) కల్యాణ్ సుందరమ్
3) ఎస్పీ సేన్వర్మ
4) నాగేంద్ర సింగ్
5) టి. స్వామినాథన్
6) ఎస్.ఎల్ శక్దర్
7) ఆర్కే త్రివేది
8) ఆర్వీఎస్ పేరి శాస్త్రి
9) వీఎస్ రమాదేవి
10) టీఎన్ శేషన్
11) ఎస్ఎస్ గిల్
12) జేఎం లింగ్డో
13) టీఎస్ క్రిష్ణమూర్తి
14) బీబీ టాండన్
15) ఎన్. గోపాలస్వామి
16) నవీన్ చావ్లా
17) ఎస్వై కురేశీ
18) వీఎస్ సంపత్
19) హెచ్ఎస్ బ్రహ్మ
20) నసీం జైదీ
21) అచల్కుమార్ జ్యోతి
22) ఓం ప్రకాశ్ రావత్
23) సునీల్ అరోరా
24) సుశి చంద్ర
25) రాజీవ్ కుమార్