Tuesday, November 26, 2024

పీఆర్సీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో వేతన సవరణ ప్రకటించేందుకు ఆర్థికశాఖ ఈసీ అనుమతి కోరింది.  దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. అయితే అనవసర ప్రచారం చేయరాదని, ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదని ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్​ కుమార్ లేఖ రాశారు.

దీంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీఆర్సీ మీద ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి తెలంగాణలో పీఆర్సీ గురించి ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. పీఆర్సీపై సూచనప్రాయంగా చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రెండు, మూడు రోజుల్లో స్వయంగా తానే పీఆర్సీపై ప్రకటన చేస్తానని కూడా ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల‌కు ఈ శుభ‌వార్త వినిపించారు. రెండు, మూడు రోజుల్లోనే గౌర‌వ‌ప్రద‌మైన పీఆర్సీ ప్రకటిస్తామ‌ని వెల్లడించారు. ఉద్యోగుల మీద త‌మ‌కెంత ప్రేమ ఉందో గ‌త పీఆర్సీతోనే చూపించామన్న ఆయన.. తమ ఉద్యోగులు కాల‌ర్ ఎత్తుకుని భారత దేశంలోనే తాము అత్యధిక‌ జీతాలు పొందుతామ‌ని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement