తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యుల్ విడుదల కావడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు కూడా అడ్డంకులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి 20 మంది స్టార్ క్యాంపెయినర్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. నిబంధనలకు లోబడి ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నకల కోసం ఈవీఎంలతోపాటు ఎన్నికల ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని చెప్పారు. ఎన్నికల నియామవళికి సంబంధించి సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కొవిడ్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని శశాంక్ గోయల్ ఆదేశించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. కాగా, హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,36,430 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,17,552, మహిళ ఓటర్లు 1,18,716 మంది ఉన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రజలు బికారులా?: బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్