హైదరాబాద్ నగర వాసుల కోసం పాతబస్తీలో సండే ఫన్ డే నిర్వహించనున్నారు. ప్రతి ఆదివారం టాంక్ బండ్ వద్ద నిర్వహిస్తున్నమాదిరిగానే పాతబస్తీలోని చార్మినార్ వద్ద కూడా ఆదివారం నుంచి వారం వారం ‘ ఏక్ షామ్ చార్మినార్ కేనామ్ ’ పేరు ఫన్‌డే నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సండే ఫన్ డే కార్యక్రమం కొనసాగుతుంది. పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే కార్యక్రమాలు, వివిధ రకాల ఫుడ్‌స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
సండే ఫన్ డే సందర్భంగా చార్మినార్ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించరు. ఈ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అఫ్జల్ గంజ్, మదీనా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గుల్జార్ హౌస్ వద్ద మెట్టికా షేర్, కలికామన్, ఈతేబార్ చౌక్ వైపు మళ్లించనున్నారు. ఫలక్‌నుమా, హిమత్ పురా నుంచి వచ్చే వాహనాలను పంచమోహల వద్ద చార్మినార్, షా ఫంక్షన్ హాల్, మొఘల్ పురా ఫైర్ స్టేషన్‌రోడ్, బీబీబజార్ వైపు మళ్లించనున్నారు. మూసబౌలి, ముర్ఘీచౌక్, ఘాన్సీబజార్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాడ్ బజార్, మోతీగల్లి వద్ద కిల్వత్ రోడ్డు వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. చార్మినార్ వద్దకు వచ్చే సందర్శకులకు పార్కింగ్ సదుపాయం కూడా అధికారులు కల్పించారు.
ఇది కూడా చదవండి: అసమ్మతి లీడర్లకు షాకిచ్చిన సోనియా.. ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ఎవరంటే..