Friday, November 22, 2024

నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి.. మంత్రి గంగుల‌

తెలంగాణ వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ నియోజకవర్గంలో తీగలగుట్టపల్లి ఖాజీపూర్ గ్రామాల్లో రూ.5.5 కోట్లతో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల ప‌లు గ్రామాలకు లో ఓల్టేజీ స‌మ‌స్య తీర‌డంతో పాటు నిరంతరం నాణ్య‌మైన‌ విద్యుత్ అందుతుంద‌ని పేర్కొన్నారు.

దీనిలో భాగంగా తీగల గుట్టపల్లిలో రూ.2.5కోట్లు, ఖాజీపూర్ లో రూ.3కోట్లతో 33/11 కెవి సబ్ స్టేషన్ లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. మెరుగైన విద్యుత్తు సేవలను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఇప్పటికే పెరుగుతున్న డిమాండుకు తగినట్లు సరఫరాపై దృష్టి సారించిన యంత్రాంగం లోవోల్టేజీ సమస్యను రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కొత్త ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేసిన‌ మంత్రి గంగులను తీగల గుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్థులు శాలువాలతో సన్మానించారు. గతంలో ఈ ప్రాంతంలో సాగు రైతులు విద్యుత్‌ సరఫరా లేక ఎన్నో ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి 24గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో సతమతమయ్యే వారమని, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement