కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తనపై తోడేళ్లలా దాడులు చేస్తున్నవారు ఇక్కడ ఎవరి గెలుపులో అయినా సహకరించారా అంటూ సూటిగా ప్రశ్నించారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి సభ్యత, సంస్కారం ఉండాలని హితవు పలికారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
తన ప్రాణం ఉన్నంతవరకు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని చెప్పారు. తనపై కక్షతో తనను కొందరు ఇబ్బంది పెట్టారని.. తన మద్దతుదారులు, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు పట్టిన గతే రేపు నీకు పట్టవచ్చంటూ నియోజకవర్గ ఇంఛార్జిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. 2023 తర్వాత నువ్వు ఉండవు.. నీ అధికారం కూడా ఉండదంటూ ఘాటు విమర్శలు చేశారు.