తాను చెప్పినట్టే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట అసైన్డ్ భూముల కబ్జా విషయంలో ఈటెల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై విచారణ జరిపిన మెదక్ కలెక్టర్ హరీష్ ఇచ్చిన నివేదిక పూర్తిగా నిరాధారమని సోమవారం నాటి మీడియా సమావేశంలో ఈటెల చెప్పారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టే వారు నివేదిక ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు నోటీసు ఇవ్వకుండానే విచారణ జరిపించారని, తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈటెల కుటుంబం(జమున హ్యాచరీస్) పిటిషన్ లో పేర్కొంది.
కనీసం స్పష్టత లేకుండా ఆ నివేదికను మెదక్ కలెక్టర్ తయారు చేశారని ఈటెల ఆరోపించారు. కనీసం వావి వరసలు కూడా లేకుండా తన కొడుకును తన భార్యకు భర్తగా చూపించారని, దీన్ని బట్టే అది తప్పుడు నివేదిక అని అర్థమవుతోందన్నారు. ఇక ఈ భూముల వ్యవహారంలో ఇప్పటికే ఈటెలను మంత్రి పదవి నుంచి తొలగించిన ప్రభుత్వం.. నిన్న రేవంత్‌రెడ్డి చేసిన దేవరయాంజాల్ భూముల కబ్జా ఆరోపణలపై కూడా నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని వేసింది. ఇందులో కూడా ఈటెల హస్తం ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోంది.