నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీపై తిరుగుబావుటా ఎగురవేసి చాన్నాళ్లు అవుతోంది. వైసీపీ సర్కారుపై నిత్యం విమర్శలు చేయడమే కాకుండా జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కూడా ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అయినా జగన్ మాత్రం సైలెంట్‌గా ఉన్నట్లే కనిపించారు. ఎప్పుడైనా వైసీపీ నేతలే రఘురామపై ఎటాక్ చేశారు తప్పితే.. ఈ విషయంపై జగన్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఉన్నట్లుండి సొంత పార్టీ ఎంపీ అరెస్ట్ చేయించేవరకు జగన్ ఎందుకు వెళ్లారు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
దీనికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్‌ను చూసే జగన్ ఈ మూవ్ తీసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం చేతిలో ఉంటే ఎంత హడావిడి చేయవచ్చో ఇటీవల ఈటెల రాజేందర్ విషయంలో నిరూపితమైంది. కలెక్టర్లు, కమిటీలు, సర్వేలు, మంత్రి పదవి తొలగించడాలు.. ఇలా నానా హడావిడి తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంది. ఒక్క మాటా అనని ఈటెలతోనే కేసీఆర్ ఆడేసుకున్నారంటే.. తమపై నోరు పారేసుకుంటున్న రఘు రామని మనం ఇంకెంత ఆడుకోవచ్చు అన్న పాయింట్‌తోనే సీఎం జగన్ రంగంలోకి దిగారనే చర్చ నడుస్తోంది. పైగా రఘురామ తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి , కేసీఆర్ మద్దతు కూడా తమకు ఉండటంతో జగన్ ధైర్యం చేసి ఎంపీని అరెస్ట్ చేయించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.