మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నియోజక వర్గం నుంచి ఈటెల రాజేందర్ పోటీకి దిగకుండా ఆయన భార్య జమునను బరిలోకి దింపుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఆదివారం నాడు జమున పలు వ్యాఖ్యలు చేశారు.
హుజురాబాద్ ఉపఎన్నిక పోటీలో తాను కూడా ఉన్నట్లు జమున వ్యాఖ్యానించారు. అయితే ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన భర్త పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ తాను తన భర్త ఈటలను వెనకుండి నడిపించానని ఆమె తెలిపారు. అలాగే, ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని అన్నారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో ఆమె ప్రచారం చేస్తుండటం గమనార్హం.
ఈ వార్త కూడా చదవండి: రేపటి నుంచి ఈటెల రాజేందర్ పాదయాత్ర